
దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రాణాలతో పోరాడుతున్న వారికి ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. సకాలంలో ఆసుపత్రులకు తీసుకెళ్లినా.. ఆక్సిజన్ అందక జనం పిట్టల్లా రాలుతున్నారు.
ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రాణవాయువు అందించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. క్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచానికి అండగా నిలిచిన భారత్ ఇప్పుడు సాయం కోసం ఎదురుచూస్తోంది.
అయితే మనదేశానికి ఆపన్న హస్తం అందించేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకొస్తోంది. ముఖ్యంగా ప్రాణవాయువు సరఫరాకు సింగపూర్‌తో జరిపిన చర్చలు సఫలంకాగా ఆక్సిజన్ అందించేందుకు ఆ దేశం అంగీకరించింది.
Also Read:ఆక్సిజన్ ట్యాంకర్‌ను ఆపితే ఉరిశిక్ష: ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు
సింగపూర్‌లోని చాంగి విమానాశ్రయంలో.. యుద్ధ విమానాల్లోకి భారీ ఆక్సిజన్ ట్యాంకర్లను ఎక్కిస్తున్న వీడియోను కేంద్ర హోంశాఖ పంచుకుంది. త్వరలోనే ఆ ట్యాంకర్లు భారత్‌కు చేరుకోనున్నాయి.
మరోవైపు దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. రాజధాని ఢిల్లీలో సమస్య తీవ్రంగా ఉంది. ప్రాణవాయువు అందక ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి 20 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
మరో 200 మంది ఆక్సిజన్ పడకలపై చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. మరోవైపు సర్ గంగారామ్‌లో ప్రాణవాయువు సరిపడా లేక గురువారం 25 మంది మృతిచెందారు.