యూరప్ లో దారుణం.. కుటుంబసభ్యులతో గొడవపడి, 11మందిని కాల్చి చంపాడు..

By Bukka SumabalaFirst Published Aug 13, 2022, 11:54 AM IST
Highlights

కుటుంబంతో గొడవ పడ్డ ఓ వ్యక్తి.. పట్టరాని కోపంతో కాల్పులకు తెగబడ్డాడు. విచక్షణారహితంగా గన్ ను పేలుస్తూ.. కుటుంబసభ్యులతో పాటు ఇరుగు, పొరుగువారిమీదా తూటాలు కురిపించాడు. 

యూరప్ : అగ్నేయ ఐరోపా దేశం మెంటెనెగ్రోలో మాస్ షూటింగ్ ఘటన కలకలం రేపింది. శుక్రవారం ఓ సాయుధుడు తుపాకీతో విధ్వంసం సృష్టించాడు. తన చుట్టుపక్కల ఉన్న వారిపై విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనపై స్పందించేందుకు పోలీసులు నిరాకరించారు. అయితే, సెటింజేకు చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడని, ఆ తర్వాత ఇరుగు పొరుగు వారిపై కూడా తుపాకితో తూటాల వర్షం కురిపించాడు అని స్థానిక మీడియా తెలిపింది.

ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. మెంటెనెగ్రో అంతర్గత వ్యవహారాల శాఖ కూడా ఈ ఘటనపై స్పందించలేదు. పర్యాటకంగా మంచి గుర్తింపు పొందిన ఈ దేశంలో ఇలాంటి భయానక ఘటన జరగడం దశాబ్దాల చరిత్రలోనే ఇదే తొలిసారి. చుట్టూ పర్వతాలు ఉండే ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ప్రపంచ దేశాల నుంచి పర్యాటకులు అనేక మంది వెడుతుంటారు. అక్కడి పర్యాటకానికి ఇదే మంచి సీజన్. ఎక్కువమంది సందర్శకులు వచ్చే సమయంలో మాస్ షూటింగ్ జరగడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.

అమెరికాలో కాల్పుల కలకలం: ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు

ఇదిలా ఉండగా, అగ్రరాజ్యం అమెరికా ఇటీవల కాల్పులతో వణికిపోతోంది. ఈ క్రమంలోనే జులై 5న షికాగోలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. షికాగో సమీపంలోని హైలాండ్ పార్క్ లో స్వాతంత్ర దినోత్సవ పరేడ్ జరుగుతుండగా ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 24 మంది గాయపడ్డారు. వేడుకల్లో భాగంగా పరేడ్ జరుగుతుండగా సమీపంలోని ఓ రీటెయిల్డ్ స్టోర్ పై నుంచి సాయుధుడైన ఓ వ్యక్తి కాల్పులకు దిగాడు. దీంతో అక్కడున్న వారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఏం చేయాలో తెలియక తీవ్ర భయాందోళనతో  అంతా తలోదిక్కు పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

ఇదిలా ఉండగా, జూలై 3న యూరప్లోని డెన్మార్క్ లో కాల్పుల ఘటన  వెలుగులోకి వచ్చింది. దేశ రాజధాని కోపెన్హాగన్లోని షాపింగ్ మాల్ లో కొంతమంది వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కాల్పులను ఆపే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఓ దుండగుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం నాటి కాల్పుల్లో పలువురు గాయపడినట్లు డెన్మార్క్ పోలీసులు తెలిపారు. సిటీ సెంటర్, విమానాశ్రయం మధ్య ఉన్న అమేగర్ జిల్లాలోని పెద్ద ఫీల్డ్ మాల్ చుట్టూ పోలీసు బలగాలను మోహరించినట్లు కోపెన్ హాగన్ పోలీసులు ట్వీట్ చేశారు.  

ఈ కాల్పుల ఘటన గురించి సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకున్నామని, అక్కడ చాలా మందిపై కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని కోపెన్ హాగన్ పోలీసులు తెలిపారు. కాల్పుల సమయంలో ప్రజలు భయంతో పారిపోతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్థానిక మీడియా సంస్థలు షేర్ చేసిన ఫొటోల్లో భారీ సంఖ్యలో పోలీసులు, కనీసం పది అంబులెన్సులు కనిపిస్తున్నాయి.

click me!