
అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. స్మిత్స్ బర్గ్ లోని మేరీల్యాండ్ పట్టణంలోని ఓ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్లో గురువారం ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు అక్కడే చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని సీఎన్ఎన్ వెల్లడించింది. స్మిత్స్ బర్గ్ జరిగిన ఘటనలో ముగ్గురు మరణించారని, ఒక సైనికుడి భుజంపై గాయాలు అయినట్టు మేరీల్యాండ్ గవర్నర్ లారీ హొగన్ తెలిపారు. అయితే ఈ ఘటనకు పాల్పడింది ఎవరనేది తనకు తెలియదని గవర్నర్ చెప్పారని సీఎన్ఎన్ నివేదించింది.
బాల్టిమోర్ నగరానికి 75 మైళ్ల దూరంలోని స్మిత్ బర్గ్ లోని కొలంబియా మెషిన్ వద్ద గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ కాల్పులు జరిగాయని వాషింగ్టన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. ఘటనా స్థలంలోనే ముగ్గురు మరణించారని, మరొకరు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొంది. కాగా లా ఎన్ ఫోర్స్ మెంట్ రాకకు ముందే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అయితే అనుమానాస్పద వాహనాన్ని మేరీల్యాండ్ స్టేట్ పోలీసులు మాప్లెస్‌విల్లే రోడ్, మౌంట్ ఏట్నా రోడ్ ప్రాంతంలో గుర్తించారు.
నూపుర్ శర్మ వ్యాఖ్యలపై హౌరాలో ఆందోళన.. మమతా బెనర్జీ ఆగ్రహం.. ఢిల్లీకెళ్లాలని సూచన
అయితే అనుమానితుడు, ట్రూపర్ కు మధ్య తుపాకీ కాల్పులు జరిగాయి. ఇద్దరికి గాయాలు కాగా వైద్య చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. ‘‘ఎఫ్‌బీఐ, ఏటీఎఫ్ తో సహా పలు ఫెడరల్ ఏజెన్సీలు సంఘటనపై దర్యాప్తులో సహాయం చేయడానికి ప్రతిస్పందించాయి. ఈ సంఘటనకు సంబంధించి కమ్యూనిటీకి ఎలాంటి యాక్టివ్ ముప్పు లేదు ’’ అని షెరీఫ్ కార్యాలయం తెలిపింది.
ఐదు రోజుల కిందట అమెరికాలోని ఫిలడెల్ఫియాలో శనివారం అర్థరాత్రి జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా దాదాపు 11 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. మృతుల్లో ఒక మహిళ కూడా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసు ఇన్‌స్పెక్టర్ డీఎఫ్ పేస్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కాల్పులు చోటుచేసుకున్నప్పుడు ప్రతి వీకెండ్ లాగానే వందలాది మంది ప్రజలు సౌత్ స్ట్రీట్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే షూటర్లు ఒక్కసారిగా పెద్ద మొత్తంలో వీధిలో కాల్పులు జరిపారు. దీంతో ఈ ఘటన చోటు చేసుంకుంది ’’ అని తెలిపారు.
జూన్ 1వ తేదీన కూడా ఓక్లహోమా రాష్ట్రం తుల్సాలోని హాస్పిటల్ క్యాంపస్‌లోని మెడికల్ భవనంపై దుండగుడు కాల్పులు జరిపిన ఘటనలో నలుగురు మరణించారు. ఘటన సమయంలో జరిగిన ఎదురు కాల్పుల్లో షూటర్ కూడా చనిపోయారు. అలాగే మే 24న అమెరికాలోని టెక్సాస్లోని ఒక ఎలిమెంటరీ స్కూల్లో 18 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 19మంది విద్యార్థులతో సహా 21 మంది మృత్యువాత పడ్డారు. మృతి చెందిన విద్యార్థుల వయసు నాలుగు నుంచి 14 ఏళ్ల మధ్య ఉంటుందని అక్కడి అధికారులు తెలిపారు. గత కొన్నేళ్లలో ఇది అత్యంత ఘోరమైన సంఘటన అని ఆ రాష్ట్ర గవర్నర్ గ్రేగ్ అబాట్ వెల్లడించారు. మెక్సికన్ సరిహద్దుల్లోని ఉవాల్డేలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత పోలీసుల కాల్పుల్లో దుండగుడు చనిపోయాడు.