
Canada Elections 2025: కెనడాలో జరిగిన ఫెడరల్ ఎన్నికల ఫలితాలు భారత్‌లో సంబరాలకు దారితీశాయి. కెనడియన్ నాయకుడు జగ్మీత్ సింగ్ ఓటమి భారత్‌కు శుభవార్త అని చెప్పుకుంటున్నారు. ఈ ఓటమితో భారత్-కెనడా సంబంధాలు మెరుగుపడతాయని, ఖలిస్తాన్ ఉద్యమానికి కళ్ళెం పడుతుందని ఆశిస్తున్నారు.
భారతీయ సంతతికి చెందిన కెనడియన్ పౌరుడు జగ్మీత్ సింగ్. ఖలిస్తాన్ మద్దతుదారు అయిన ఆయన కెనడాలోని న్యూ డెమోక్రటిక్ పార్టీ (ఎన్డీపీ) నాయకుడు. ఈ ఎన్నికల్లో తన సాంప్రదాయ స్థానమైన బర్నాబీ సెంట్రల్‌లో లిబరల్ పార్టీ అభ్యర్థి వేడ్ చాంగ్ చేతిలో ఓడిపోయారు.
ఈ ఎన్నికలకు ముందు కింగ్ మేకర్ అనుకున్న ఎన్డీపీ కేవలం 7 స్థానాలకే పరిమితమైంది. దీంతో కెనడియన్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో జాతీయ పార్టీ హోదాను కోల్పోయింది. కెనడాలో జాతీయ పార్టీ హోదాకు కనీసం 12 స్థానాలు అవసరం.
ఫలితాలు వెలువడిన కొన్ని గంటల్లోనే 46 ఏళ్ల జగ్మీత్ సింగ్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేశారు. తన జీవితంలో ఇదే గొప్ప గౌరవమని.. కానీ మరిన్ని స్థానాలు గెలవలేకపోవడం బాధాకరమని అన్నారు.
జగ్మీత్ సింగ్ ఓటమి, ఎన్డీపీ పతనంతో గత రెండేళ్లుగా భారత్, కెనడా మధ్య ఉన్న దౌత్య సంబంధాలు మెరుగుపడతాయని నిపుణులు అంటున్నారు. 2023లో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత జస్టిన్ ట్రూడో, జగ్మీత్ సింగ్ ఇద్దరూ ఆధారాలు లేకుండా భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించారు. భారత్ ఈ ఆరోపణలను ఖండించింది. జగ్మీత్ ఓటమితో భారత్ వ్యతిరేక ప్రకటనలు చేసిన, ఆర్ఎస్ఎస్, బీజేపీలను నిషేధించాలని డిమాండ్ చేసిన వ్యక్తి రాజకీయాల నుంచి తప్పుకున్నట్లయిందని నిపుణులు భావిస్తున్నారు.
కెనడా కొత్త ప్రధాని మార్క్ కార్నీ బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతోబ కెనడా, భారత్ మధ్య సంబంధాలు మెరుగుపడనున్నాయి. ఇరుదేశాల మధ్య 2023 లో ద్వైపాక్షిక వాణిజ్యం 9 బిలియన్ డాలర్లుగా ఉన్నది... ఇది మళ్ళీ పుంజుకుంటుందని ఆశిస్తున్నారు.