నా తండ్రికి మద్దతు ఉంటుంది.. కానీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు: ఇవాంకా ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

By Sumanth KanukulaFirst Published Nov 16, 2022, 12:08 PM IST
Highlights

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్  కీలక వ్యాఖ్యల చేశారు. తాను తన తండ్రిని ప్రేమిస్తున్నానని.. అయితే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఇవాంకా ట్రంప్ స్పష్టం చేశారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్  కీలక వ్యాఖ్యల చేశారు. తాను తన తండ్రిని ప్రేమిస్తున్నానని.. అయితే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఇవాంకా ట్రంప్ స్పష్టం చేశారు. తాను మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవనున్నట్టుగా డోనాల్డ్ ట్రంప్ మంగళవారం రాత్రి ప్రకటించారు. మార్ ఎ లాగోలో జరిగిన కార్యక్రమంలో ట్రంప్ ఈ ప్రకటన చేయగా.. ఆయన పిల్లలు ఇవాంకా గానీ,  డొనాల్డ్ ట్రంప్ జూనియర్ గానీ, ఇటీవల వివాహం చేసుకున్న టిఫనీ ట్రంప్ కూడా హాజరు కాలేదు. ఇవాంకా భర్త జారెడ్ కుష్నర్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అయితే ట్రంప్ నుంచి ఈ ప్రకటన వెలువడిన తర్వాత ఇవాంకాల ట్రంప్ ఫాక్స్ న్యూస్ డిజిటల్‌తో మాట్లాడుతూ.. తన తండ్రిని చాలా ప్రేమిస్తున్నానని  చెప్పారు. ఆయన మద్దతు ఇస్తానని.. అయితే రాజకీయాల్లో పాల్గొనడానికి ప్లాన్ చేయనని తెలిపారు. ప్రస్తుతం తన పిల్లలకు, కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడంపై దృష్టి సారించినట్టుగా చెప్పారు. 

‘‘ఈసారి నేను నా చిన్న పిల్లలకు, కుటుంబంగా మేము సృష్టించుకుంటున్న వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిస్తాను. నేను ఎల్లప్పుడూ మా నాన్నను ప్రేమిస్తాను, మద్దతు ఇస్తాను. రాజకీయ రంగానికి వెలుపల నేను అలా చేస్తాను. అమెరికన్ ప్రజలకు సేవ చేసే గౌరవాన్ని కలిగి ఉన్నందుకు నేను కృతజ్ఞురాలిని. మా పరిపాలన అనేక విజయాల గురించి ఎల్లప్పుడూ గర్విస్తాను’’ అని ఇవాంకా ట్రంప్ పేర్కొన్నారు. 

‘‘నా తండ్రితో నేను చాలా క్లోజ్‌గా ఉంటాను. అది మారలేదు.. ఎప్పటికీ మారదు. చాలా సంవత్సరాలుగా నేను అనేక పాత్రలను పోషించాను.. కానీ కుమార్తె పాత్ర చాలా ముఖ్యమైనది. అయితే నేను ఈ సమయంలో నా పిల్లలను ప్రేమిస్తున్నాను.. మయామిలో జీవితాన్ని ప్రేమిస్తున్నాను. ప్రైవేట్ రంగానికి తిరిగి వచ్చినప్పుడు స్వేచ్ఛ, గోప్యతను ప్రేమిస్తున్నాను. ఇది నా జీవితంలో గొప్ప సమయాలలో ఒకటి. మేము ప్రస్తుతం ఉన్న చోట మేము సంతోషంగా ఉన్నాము. మేము మా తండ్రికి - ఆయన పిల్లలుగా మద్దతునిస్తూనే ఉంటాం ’’ అని ఇవాంకా పేర్కొన్నారు. 

డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇవాంకా, కుష్నర్‌లు వాషింగ్టన్ డీసీలో నాలుగు సంవత్సరాలు గడిపారు. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వారు మయామికి వెళ్లారు. ప్రస్తుతం వారు అక్కడే నివసిస్తున్నారు. ఇక, ఇవాంకా, కుష్నర్‌లకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. 

click me!