పాస్‌పోర్టు లేదని.. పసిఫిక్ మహా సముద్రాన్ని ఈది దేశాన్నే దాటేశాడు! ఆ దేశంలో కొత్త చిక్కులు..

By telugu team  |  First Published Sep 16, 2021, 2:50 PM IST

ఓ వ్యక్తి పసిఫిక్ మహాసముద్రం గుండా ఒక దేశం నుంచి మరో దేశానికి ఈతకొడుతూ వెళ్లారు. పుతిన్ ప్రభుత్వ పాలనపై వ్యతిరేకతతో, భవిష్యత్‌పై బెంగతో ఆయన జపాన్‌లో ఆశ్రయం కోరడానికి 23 గంటలు పసిఫిక్‌లో ఈదుతూ వెళ్లారు. ఎట్టకేలకు జపాన్ దీవి చేరుకున్నాడు. ఇప్పుడు ఆయనను ఇమ్మిగ్రేషన్ అధికారులు విచారిస్తున్నారు.


న్యూఢిల్లీ: మహాసముద్రాల్లోకెల్లా అతిపెద్ద పసిఫిక్‌నే ఈదేశాడు. అతిశీతలంగా ఉన్న ఉప్పునీటిలో, మరోవైపు వర్షం పడుతుండగా రాత్రంతా ఈతకొట్టాడు. సొరచేపలు, ఇతర ప్రమాదాలను తలుచుకుంటూ భయపడుతూనే ఉదయానికల్లా జపాన్ ఒడ్డునపడ్డాడు. 23 గంటలపాటు ఈతకొట్టి 38ఏళ్ల వాస్ ఫెనిక్స్ నొకార్డ్ మొత్తానికి రష్యా నుంచి జపాన్ చేరుకున్నాడు. ఇప్పుడు జపాన్‌లోనే ఉండాలనుకుంటున్నాడు. ఆయన విచిత్ర సాహస వివరాలు ఇలా ఉన్నాయి.

పశ్చిమ రష్యాలోని ఇజెవిస్క్ నగరంలో నివసించిన నొకార్డ్‌కు పుతిన్ హయాంలో దేశంలో పరిస్థితులు దిగజారుతున్నాయని, అందుకే విదేశాల్లో శరణార్థిగా జీవించాలని భావించాడు. కానీ, ఆయనకు పాస్‌పోర్టు లేదు. రష్యాను వదిలిపెట్టాలంటే తనకు మరో అవకాశం లేదనుకుని జపాన్‌లని హొక్కయిడో దీవికి ఈతకొట్టుకుంటూ వెళ్లిపోవాలని ఫిక్స్ అయ్యాడు. తెల్లవారుజామున 5 గంటలకు తన ప్రయాణాన్ని పసిఫిక్ సముద్రంలో ప్రారంభించాడు. మరుసటి రోజు ఉదయానికి 24 కిలోమీటర్లు ఈదేసి ఆ దీవి చేరుకున్నాడు. గతనెలలో ఈ ఘటన జరిగింది.

Latest Videos

undefined

జపాన్ దీవి ఒడ్డును చేరాక కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఆహారం కోసం సమీపంలోని ఓ షాప్‌కు వెళ్లగా అనుమానాస్పదంగా కనిపిస్తున్నాడని ఓ స్థానికుడు పోలీసులకు విషయం తెలిపాడు. వెంటనే పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. జపాన్‌లో ఆశ్రయం పొందాలనుకుంటున్నాడని అధికారులకు నొకార్డ్ చెప్పాడు. రష్యాలోని తాను కునాశిరి దీవికి వెళ్లిన తర్వాత ఓ సారి స్వస్థలానికి వెళ్లగా పోలీసులు విచారించారని వివరించాడు. పుతిన్ పాలనలో ఆర్థికాంశాలు మెరుగ్గా లేవని, పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్న ఆయన సురక్షితమైన ఉద్యోగం పొందలేరనే నిరాశలో ఉన్నాడు.

కస్టడీలో ఉండగానే ఓ మీడియాతో మాట్లాడాడు. ‘పసిఫిక్ మహాసముద్ర అలలు శీతలంగా ఉన్నాయి. రాత్రిపూట అసలేమీ చూడలేకపోయాను. దానికితోడు వర్షం కురిసింది. అంతేకాదు, ప్రాణాలు హరించే సొర చేపలను గుర్తుచేసుకునీ భయపడ్డా. నా తల్లిని మళ్లీ చూసుకోలేమోననే బెంగ పీడించింది’ అని అన్నారు.

నొకార్డ్ జపాన్ వెళ్లడం ఇదే తొలిసారి కాదని, గతంలోనూ హిరోషిమా పర్యటించి బస్సు, సైకిల్ ద్వారా టోక్యోకు వెళ్లాడని, వీసా గడువు ముగిసినా అక్కడే ఉండటంతో అధికారులే ఆయనను తిరిగి రష్యాకు పంపినట్టు రష్యా మీడియా పేర్కొంది. జపాన్ సంస్కృతిపై ఆయన మనసుపారేసుకున్నారనీ వివరించింది. రష్యా అధికారులు నొకార్డ్ ఇంటిలో తనిఖీలు చేశారు. జపాన్ పోస్టర్లు ఆయన ఇంటిలో లభించాయని, జపాన్ కల్చర్‌కు నొకార్డ్ అభిమానిగా తెలుస్తున్నదని పేర్కొన్నారు. డోరేమాన్, మాంగా యానిమేషన్ సిరీస్ చూస్తూ పెరిగాడనీ మరొకరు వివరించారు.

click me!