ఇండోనేషియా భూకంపం: 268కు పెరిగిన మృతుల సంఖ్య, శిథిలాల కింద కూరుకుపోయిన గ్రామాలు

By Mahesh KFirst Published Nov 22, 2022, 5:11 PM IST
Highlights

ఇండోనేషియాలో సంభవించిన భూకంపం తీవ్ర ప్రాణ నష్టాన్ని కలిగించింది. ఇప్పటికి మృతుల సంఖ్య 252కు పెరిగినట్టు అధికారులు తెలిపారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నదని చెప్పారు. మృతులు, గాయపడ్డవారిలో పిల్లలూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. పర్వతాలు అధికంగా ఉన్న ప్రాంతంలో భూకంపం చోటుచేసుకోవడంతో కొండ చరియలు విరిగిపడి కూడా నివాసాలు కుప్పకూలిపోయాయి. ఈ శిథిలాల కిందే ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది.
 

జకర్తా: ఇండోనేషియాలో భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 252కు చేరినట్టు స్థానిక ప్రభుత్వం మంగళవారం ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొంది. ఇంకా 31 మంది ఆచూకీ కనిపించనేలేదని వివరించింది. కనీసం 377 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది. కాగా, నిరాశ్రయులైన వారి సంఖ్య 7,060 వరకు ఉంటుందని పేర్కొంది.సుమారు 13 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భూకంప బాధితుల్లో చిన్నారులే ఎక్కువ మంది ఉన్నట్టు తెలుస్తున్నది.

ఇండోనేషియాకు చెందిన జావాలో సోమవారం మధ్యాహ్నం పూట సుమారు 1 గంట ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. ఈ సమయంలో పిల్లలు ఇంకా స్కూల్‌లోనే ఉన్నారు. భూకంపం కారణంగా స్కూల్ భవనాలూ కూలిపోయాయి. ఫలితంగా పిల్లలు పెద్ద సంఖ్యలో మరణించారని నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ హెన్రి అల్ఫియండీ తెలిపారు.

సోమవారం 5.6 తీవ్రతతో పశ్చిమ జావా ప్రావిన్స్‌లో భూకంపం సంభవించింది. ఇండోనేషియాలోని అత్యధిక జనాభాగల ప్రావిన్స్ ఇదే కావడం గమనార్హం. ఈ ప్రావిన్స్‌లో పర్వతాలు ఎక్కువగా ఉన్నాయి. ఫలితంగా ఇక్కడ భూకంపం వల్ల కొండ చరియలూ విరిగిపడ్డాయి. దీంతో భూకంపం కలిగించే నష్టంతోపాటు చరియలు విరిగిపడి కూడా అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. అందుకే సియంజూర్ పట్టణంలో శిథిలాలతో నిండిపోయింది. ఈ పట్టణంలో పలు గ్రామాలు శిథిలాల కిందే కూరుకుపోయాయి. కనీసం ఒక్క గ్రామమైనా పూర్తిగా శిథిలాలతో నిండిపోయిందని స్థానికులు చెబుతున్నారు.

Also Read: ఇండోనేషియా భూకంపం: 162 కు చేరిన మరణాలు, వందలాది మందికి గాయాలు

భవనాలు, నివాసాలు కూలిపోవడం వల్ల వాటి కింద చిక్కుకునే చాలా మంది మరణించారని స్థానిక అధికారులు చెప్పారు. రెస్క్యూ అధికారులు కాలంతోపోటీ పడుతూ సహాయక చర్యలు చేపడుతున్నారు. అధికారిక సమాచారం కంటే కూడా ఎక్కువ మంది గల్లంతైనట్టు తెలుస్తున్నది. తమ ఆప్తులు గల్లంతైనట్టు కూడా ఇంకా గుర్తించలేదని కొందరు ఆవేదన చెందుతుండటమే ఇందుకు ఉదాహరణ. ఈ కారణంగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.

ప్రెసిడెంంట్ జోకో విడోడో మంగళవారం సియంజూర్ పట్టణానికి వెళ్లారు. రెస్క్యూ ఆపరేషన్ స్థిరంగా, వేగంగా కొనసాగడానికి ఆయన పర్యటన ఉపకరిస్తుందని తెలుస్తున్నది.

క్షతగాత్రులు భారీగా ఉండటంతో సియంజూర్ పట్టణ హాస్పిటల్‌లో పేషెంట్లతో పోటెత్తిపోయింది. పేషెంట్లు పార్కింగ్ లాట్‌లోనూ నిండిపోయారు. చాలా మంది క్షతగాత్రులను టెంట్లు వేసి చికిత్స అందించారు.

click me!