‘ఆమె’ను భాగస్వాములు, కుటుంబ సభ్యులే కడతేరుస్తున్నారు.. ప్రతి 11 నిమిషాలకో మహిళ హత్య: ఐరాస చీఫ్

By Mahesh KFirst Published Nov 22, 2022, 4:17 PM IST
Highlights

ప్రపంచవ్యాప్తంగతా మహిళలపై విచ్చలవిడిగా హింస జరుగుతున్నదని ఐరాస పేర్కొంది. కుటుంబ సభ్యులు, కలిసి జీవిస్తున్నవారి చేతుల్లోనూ పెద్ద సంఖ్యలో మహిళలు లేదా బాలికలు కన్నుమూస్తున్నారని వివరించింది. ప్రతి 11 నిమిషాలకో మహిళ లేదా బాలిక కుటుంబ సభ్యులు లేదా పార్ట్‌నర్ చేతిలో ప్రాణాలు కోల్పోతున్నదని యూఎన్ చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ పేర్కొన్నారు.
 

న్యూఢిల్లీ: మహిళలకు భద్రత కరువైంది. బహిరంగ సమాజంలోనే కాదు.. పుట్టిన కుటుంబంలో, కట్టుకున్న భర్తతో, కలిసి ఉంటున్న భాగస్వామితోనూ ముప్పే ఉన్నదని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ లేదా బాలిక కుటుంబ సభ్యులు లేదా భాగస్వామి చేతిలో ప్రాణాలు కోల్పోతున్నదని వివరించింది. మానవ హక్కుల ఉల్లంఘనల్లోకెల్లా ఇది అత్యంత విస్తృతంగా కనిపిస్తున్న దారుణమని యూఎన్ చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ తెలిపారు. ప్రభుత్వాలు వెంటనే యాక్షన్ ప్లాన్ గీసుకుని అమలు చేయాలని, ఈ విపరీతాన్ని ముగించాలని పిలుపు ఇచ్చారు.

మహిళలపై హింసను ముగించాలని పిలుపుతో జరుపుతున్న అంతర్జాతీయ దినోత్సవం ఈ నెల 25వ తేదీన పాటిస్తున్నారు. ఈ సందర్భంలో యూఎన్ సెక్రెటరీ జనరల్ గుటెర్రస్ సంచలన విషయాలు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా మతం, ప్రాంతం, ఇతర తేడాలేమీ లేకుండా అన్ని చోట్లా కనిపిస్తున్న మానవ హక్కుల ఉల్లంఘన ఇది అని వివరించారు. ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ లేదా బాలికను కలిసి ఉంటున్న పార్ట్‌నర్ లేదా కుటుంబ సభ్యుల కడతేరుస్తున్నారని తెలిపారు. కరోనా మహమ్మారి, ఆర్థిక కుదుపులు ఇలా అనేక ఒత్తిళ్లు అన్నీ చివరకు మహిళలపై భౌతిక, దూషణలు, వేధింపుల వైపు మళ్లుతున్నాయని ఆయన వివరించారు.

భౌతికంగానే కాదు.. ఆన్‌లైన్‌లోనూ విచ్చలవిడిగా వారు హింసను ఎదుర్కోవాల్సి వస్తున్నదని తెలిపారు. మహిళా సాధికార వ్యతిరేకుల అవాకులు చెవాకులు మొదలు లైంగిక వేధింపులు కేంద్రంగా చేసే విద్వేష ప్రసంగాల వరకు వారు హింసను భరించాల్సి వస్తున్నదని వివరించారు. ఫొటోలతో వేధింపులు, మూకగా ఏర్పడి మహిళలను వేధిస్తున్న ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

Also Read: Non Consensual Sex: ఇష్టం లేని సెక్స్ కు నో చెప్పే హక్కు భార్యకు ఉంది: ఢిల్లీ హై కోర్టు

మొత్తం మానవాళిలో సగమైన మహిళలపై వివక్ష, హింస, దూషణలు భారీ మూల్యంతో జరుగుతున్నాయని ఆంటోనియో గుటెర్రస్ వివరించారు. ఇవి జీవితంలో అన్ని పార్శ్వాల్లో మహిళల భాగస్వామ్యానికి అడ్డంకులుగా మారుతున్నాయని, వారి ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నాయన్నారు. ఫలితంగా ప్రపంచానికి అవసరమైన ఈక్వల్ ఎకనామిక్ రికవరీ, ఎదుగుదల కుంటుపడిపోతున్నాయని తెలిపారు.

అందుకే ప్రపంచదేశాల ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం వెంటనే యాక్షన్ ప్లాన్ తీసుకుని అమలు చేయాలని సూచనలు చేశారు. మహిళా హక్కుల సంస్థలు, ఉద్యమాల కోసం 2026 వరకు నిధులను 50 శాతం వరకు పెంచాలని ప్రభుత్వాలకు సూచించారు. మహిళలకు మద్దతుగా అందరూ గొంతు కలుపాలని అన్నారు. మనమంతా స్త్రీవాదులమే అని గర్వంగా ప్రకటించాలని తెలిపారు. పితృస్వామ్య నిబంధనలు, ఇతర అనేక రూపాల్లో పురుషాధిక్యతను సవాల్ చేసే ప్రజా కార్యక్రమాలకు సపోర్ట్ చేయాలని పేర్కొన్నారు.

click me!