ప్ర‌తి 11 నిమిషాల‌కు ఓ మ‌హిళ హ‌త్య‌కు గుర‌వుతోంది.. అది కూడా తన సన్నిహితుల చేతిలోనే. . : ఐరాస సెక్రటరీ జనరల్  

By Rajesh KarampooriFirst Published Nov 22, 2022, 4:38 PM IST
Highlights

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌తి 11 నిమిషాల‌కు ఒక మహిళ లేదా అమ్మాయి తన సన్నిహితల చేతిలో లేదా భాగ‌స్వామి చేతిలో ప్రాణాలు కోల్పోతున్నార‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి సెక్రెట‌రీ ఆంటోనియో గుట్రెస్ విచారం వ్య‌క్తం చేశారు.  

చిన్నారులు, మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు రూపొందించినా.. శిక్షలు విధిస్తున్నా మృగాళ్ల ప్రవర్తన తీరులో మార్పు రావడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్లు చట్టాలను లెక్క చేయకుండా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. కేవలం మన దేశంలోనే కాదు..  ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. తాజాగా ఐక్య‌రాజ్య‌స‌మితి సంచలన గణాంకాలను వెల్లడించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌తి 11 నిమిషాల‌కు ఒక మహిళ లేదా అమ్మాయి హ‌త్య‌కు గుర‌వుతోందని ఐక్య‌రాజ్య‌స‌మితి సెక్రెట‌రీ ఆంటోనియో గుట్రెస్ వెల్లడించారు. అది కూడా తన సన్నిహితుల చేతిలో లేదా భాగ‌స్వామి చేతిలో మ‌హిళ‌లు ప్రాణాలు కోల్పోతున్నార‌ని ఆయ‌న విచారం వ్య‌క్తం చేశారు. 

ప్రతి సంవత్సరం న‌వంబ‌ర్ 25న అంత‌ర్జాతీయంగా మ‌హిళ‌ల‌పై హింస‌ నిరోధక దినోత్స‌వంగా నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుట్రెస్ మాట్లాడుతూ.. ప్ర‌తి 11 నిమిషాల‌కు ఒక మ‌హిళ లేదా అమ్మాయి హత్యకు గురవుతుందని పేర్కోన్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్నో ఏండ్లుగా మహిళలు, బాలికలు హింసకు గురవుతున్నారనీ, ఇది
మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న అని ఆయ‌న అభిప్రాయపడ్డారు. 

2026 నాటికి మహిళా హక్కుల సంస్థలు, ఉద్యమాలకు నిధులను 50 శాతం పెంచాలని UN సెక్రటరీ జనరల్ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. క‌రోనా ప్యాండెమిక్, ఆర్థిక సంక్షోభం వంటివి కూడా అమ్మాయిల‌ను శారీర‌కంగా, మాన‌సికంగా వేధించ‌డానికి  కార‌ణ‌మ‌ని, ఇతర ఒత్తిళ్లు కూడా మహిళలతో ఎక్కువ శారీరక, మానసిక వేధింపులకు గురవుతున్నారని ఆయన అన్నారు. ఇది మాత్రమే కాదు..మహిళలు ప్రతిరోజూ ఆన్‌లైన్ లో ట్రోలింగ్ కు గురవుతున్నారని పేర్కొన్నారు. 

'ఈ ఘటనల వల్ల మహిళల భాగస్వామ్యం తగ్గుతోంది'

ప్ర‌పంచంలో సగం మంది మహిళలు ఇలాంటి వివక్ష,హింస పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకుంటున్నాయని ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు. ఈ సంఘటనలు సమాజంలో మహిళల భాగస్వామ్యాన్ని , ఆర్థిక మరియు స్థిరమైన అభివృద్ధిని పరిమితం చేస్తాయని, హింస, వివక్ష కారణంగా..  మహిళలు ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛలను కోల్పోతున్నారని అన్నారు. మహిళలు, బాలికలపై హింసను అంతమొందించాల్సిన సమయం అసన్నమైందని, ఈ దృగ్విషయాలను ఎదుర్కోవటానికి జాతీయ కార్యాచరణ కార్యక్రమాలను రూపొందించాలని, నిధులు సమకూర్చాలని అని ఆంటోనియో గుట్రెస్ పేర్కొన్నారు. ప్రతి దశలో ప్రభుత్వాలు, పౌర సమాజ సమూహాలను భాగస్వామ్యం కావాలని కోరారు. మ‌హిళ‌ల‌పై దాడులు, హింస అనేవి ఇక చ‌రిత్ర పుస్త‌కాల్లో చేరాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని ఐరాస సెక్రటరీ జనరల్ పిలుపునిచ్చారు. 
 
గృహ హింస తీవ్రమైన సమస్య

ఇటీవల ఐక్యరాజ్యసమితి (UN) విడుదల చేసిన నివేదికలో..  రోజురోజుకు మహిళలపై గృహ హింస తీవ్రమవుతోందని, ఇది తీవ్ర సమస్యగా మారుతుందని పేర్కోంది.ప్రపంచవ్యాప్తంగా 15-49 ఏళ్ల మధ్య వయసున్న 10 మంది మహిళలు మరియు బాలికల్లో .. ఒకరి కంటే ఎక్కువ మంది సన్నిహిత లేదా  భాగస్వామి ద్వారా లైంగిక ,శారీరక హింసను ఎదుర్కొన్నారని నివేదిక వెల్లడించింది.

click me!