ఉగాండాలో దారుణం: లోన్ కట్టమన్నందుకు భారతీయుడిని ఏకే 47తో కాల్చిచంపిన పోలీస్

By Siva KodatiFirst Published May 16, 2023, 4:43 PM IST
Highlights

ఉగాండాలో దారుణం జరిగింది. అప్పు తీర్చమన్న పాపానికి భారతీయుడిని ఉగాండాకు చెందిన పోలీస్ దారుణంగా కాల్చిచంపాడు. ఉత్తమ్ భండారీ కంపాలాలోని టీఎఫ్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్‌‌గా పనిచేస్తుండగా.. వాబ్‌వైర్ అతడి క్లయింట్ . 

ఉగాండాలో దారుణం జరిగింది. అప్పు తీర్చమన్న పాపానికి భారతీయుడిని ఉగాండాకు చెందిన పోలీస్ దారుణంగా కాల్చిచంపాడు. వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని కంపాలాలో 2.1 మిలియన్ షిల్లింగ్స్ (భారత కరెన్సీలో రూ.46,000) చెల్లించమన్నందుకు భారతీయుడిపై నిందితుడు ఏకే 47 రైఫిల్‌తో కాల్పులు జరిపాడు. మే 12న జరిగిన ఘటనలో బాధితుడు ఉత్తమ్ భండారీపై 30 ఏళ్ల ఇవాన్ వాబ్‌వైర్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన మొత్తం.. బ్యాంక్ గదిలో అమర్చిన సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉత్తమ్ భండారీ కంపాలాలోని టీఎఫ్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్‌‌గా పనిచేస్తుండగా.. వాబ్‌వైర్ అతడి క్లయింట్ . 

అతను సంస్థకు చెల్లించాల్సిన మొత్తం విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మే 12న వాబ్‌వైర్‌ను రుణం మొత్తం చెల్లించాల్సిందిగా ఉత్తమ్ భండారీ తేల్చిచెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి.. ఆగ్రహంతో వాబ్‌వైర్ తన చేతుల్లో వున్న ఏకే 47 రైఫిల్‌తో కాల్చి చంపాడు. కంపాలా మెట్రోపాలిటన్ ప్రతినిధి.. పాట్రిక్ ఒన్యాంగో స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. వాబ్‌వైర్ తన ఏకే 47 రైఫిల్‌ను ఘటనాస్థలిలోనే వదిలి పారిపోయాడని తెలిపారు. ఘటనాస్థలంలో పోలీసులు 13 కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. 

మరోవైపు.. నిందితుడి మానసిక ఆరోగ్యం సరిగా లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాబ్‌వైర్‌ తుపాకీ వాడకుండా ఉన్నతాధికారులు నిషేధం విధించారు. భండారీ హత్య అనంతరం పోలీసులు నిందితుడిని పట్టుకుని ఉగాండాలోని బుసియా పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. ఉత్తమ్ భండారీని హత్య చేసిన తుపాకీని రూమ్‌మేట్ నుంచి దొంగిలించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ హత్య నేపథ్యంలో ఉగాండాలో వుంటున్న భారతీయులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే భయపడాల్సింది ఏం లేదని.. అండగా వుంటామని పోలీస్ అధికారులు హామీ ఇచ్చారు. 


 

click me!