సూడాన్‌లో రక్షణ బలగాల మధ్యే యుద్ధం.. భారతీయులు బయటకు రావొద్దు : ఇండియన్ ఎంబసీ

By Siva KodatiFirst Published Apr 15, 2023, 8:47 PM IST
Highlights

ఆఫ్రికా దేశం సూడాన్‌ లో ఆర్మీ, పారామిలటరీ బలగాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో అక్కడి ఇండియన్ ఎంబసీ అప్రమత్తమైంది. భారతీయులు ఇళ్లు విడిచి బయటకు రావొద్దని హెచ్చరించింది.

ఆఫ్రికా దేశం సూడాన్‌ సైనిక బలగాల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతోంది. ఆర్మీ, పారామిలటరీ బలగాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో అక్కడి ఇండియన్ ఎంబసీ అప్రమత్తమైంది. భారతీయులు ఇళ్లు విడిచి బయటకు రావొద్దని హెచ్చరించింది. తదుపరి సూచనల కోసం ఎదురుచూడాలంటూ పేర్కొంది. కాగా.. పారామిలటరీలోని రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ దళాన్ని సూడాన్ సైన్యంలో విలీనం చేసేందుకు రూపొందించిన ప్రతిపాదనే ఈ అల్లర్లకు కారణం. 

ఈ విషయానికి సంబంధించి సైనికాధిపతి అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్, పారామిలటీ కమాండర్ మహ్మద్ హందాన్ మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. దేశ రాజధాని ఖార్టూమ్‌తో పాటు కొన్ని ప్రాంతాల్లో ఆర్మీ, పారా మిలటరీ బలగాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఇరు వర్గాలు కాల్పులు చేసుకోవడంతో పాటు బాంబు దాడులకు దిగుతున్నాయి. సూడాన్ అధ్యక్ష భవనం, బుర్హాన్ నివాసం, రాజధానిలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పారా మిలటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. వచ్చే కొద్దిగంటల్లో ఇరు వర్గాల మధ్య దాడులు మరింత తీవ్రమయ్యే అవకాశం వుండటంతో పౌరులు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎంబసీ అప్రమత్తమై అడ్వైజరీ జారీ చేసింది. 

click me!