కెనడా భారత్ మధ్య నెలకొన్ని ప్రతిష్టంభనను తగ్గించేందుకు జస్టిన్ ట్రూడో ప్రయత్నించారు. తాము భారత్ తో సంబంధాలు మెరుగుపర్చేందుకు ఇప్పటికీ సిద్దంగా ఉన్నామని ఆయన చెప్పారు. భారత్ ఎదుగుతున్న ఆర్థిక శక్తి అని అన్నారు.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వల్ల భారత్, కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ప్రతిష్టంభన కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ సంబంధాలు మెరుగుపర్చేందుకు కెనడా ప్రధాని ప్రయత్నించారు. గురువారం జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. ఇప్పటికీ భారత్ తో సన్నిహిత సంబంధాలను పెంపొందించుకోవడానికి తమ దేశం కట్టుబడి ఉందని చెప్పారు.కెనడా, దాని మిత్రదేశాలు భారత్ తో నిర్మాణాత్మకంగా, సీరియస్ గా సంప్రదింపులు కొనసాగించడం చాలా ముఖ్యమని అభిప్రాయం వ్యక్తం చేశారు.
భారత్ ఎదుగుతున్న ఆర్థిక శక్తి అని , ముఖ్యమైన భౌగోళిక పాత్ర అని అన్నారు. గత ఏడాది ఇండో పసిఫిక్ వ్యూహాన్ని ప్రదర్శించినందున, భారత్ తో సన్నిహిత సంబంధాలను పెంపొందించుకోవడానికి తాము చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది హత్యకు సంబంధించిన పూర్తి వాస్తవాలను రాబట్టేందుకు కెనడాతో కలిసి భారత్ పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
undefined
విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తో జరిగే ద్వైపాక్షిక సమావేశంలో విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ అంశాన్ని లేవనెత్తుతారని అమెరికా నుంచి తనకు హామీ వచ్చిందని ట్రూడో తెలిపారు. కెనడా గడ్డపై భారత ప్రభుత్వ ఏజెంట్లు తమ దేశ పౌరుడిని చంపారనే విశ్వసనీయ ఆరోపణలపై భారత ప్రభుత్వంతో మాట్లాడేందుకు అమెరికా తమతో ఉందని చెప్పారు.
ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్) చీఫ్, ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ ఎస్ నిజ్జర్ను కాల్చిచంపడంలో భారత్ పాత్ర ఉందని ట్రూడో ఆరోపించడంతో భారత్, కెనడాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో జూన్ 18న గుర్తుతెలియని దుండగుడు నిజార్ ను కాల్చిచంపిన సంగతి తెలిసిందే. అయితే ఆయన హత్యలో భారత్ ప్రమేయం ఉందని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్ లో ప్రస్తవించారు. దీనిపై తాము విచారణ జరుపుతున్నామని చెప్పారు. దీనిని భారత్ ఖండించింది. కెనడా ప్రధాని ఆరోపణలు అసంబద్ధమైనవని, ప్రేరేపితమైనవని పేర్కొంది.
కెనడాలో ఉన్న మన దేశ దౌత్యవేత్తను బహిష్కరించడంతో భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రతాపరమైన ముప్పుల దృష్ట్యా కెనడా పౌరులకు వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేసిన భారత్ న్యూఢిల్లీలోని కెనడా దౌత్యవేత్తలను వెళ్లిపోవాలని కోరింది. పెరుగుతున్న భారత వ్యతిరేక కార్యకలాపాలు, విద్వేష నేరాల దృష్ట్యా కెనడాలోని తమ పౌరులు, అక్కడికి వెళ్లాలనుకునే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని భారత్ సూచించింది.