
పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని వజీరాబాద్‌లో ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై గురువారం బుల్లెట్ దాడి జరిగింది. దీంతో ఆయనను వెంటనే హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే ఈ దాడిలో గాయపడిన తరువాత తొలిసారిగా ఖాన్ లాహోల్ హాస్పిటల్ నుంచి మీడియాతో మాట్లాడారు. తనపై దాడి జరుగుతుందని తనకు ముందే తెలుసని చెప్పారు. ప్రస్తుత షాబాజ్ షరీఫ్ ప్రభుత్వమే తనకు శత్రువు అని అభివర్ణించారు.
ఈ దాడికి సంబంధించిన ప్లాన్ గురించి తనకు ముందే తెలుసని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. నాపై నాలుగు బుల్లెట్లు దూసుకెళ్లాయని చెప్పారు. గుజరాత్‌లోని వజీరాబాద్‌లో నన్ను హతమార్చేందుకు ప్లాన్ చేశారని దాడికి ఒకరోజు ముందు తనకు తెలిసిందని వెల్లడించారు. తాను సామాన్యుల మధ్యలో నుంచి వచ్చానని, తన పార్టీ సైనిక చర్య ద్వార సైనిక స్థాపన కింద ఏర్పడలేదని అన్నారు. తాను 22 ఏళ్లుగా పోరాడుతున్నాని అన్నారు.
‘‘ నలుగురు వ్యక్తులు మూసి ఓ గదిలో తలుపులు వేసుకొని నా హత్యకు ప్లాన్ చేశారు. దీనిపై ఓ వీడియో తీసి ఉంచాను. నాకు ఏదైనా జరిగితే ఆ వీడియోను విడుదల చేయాలని నేను సూచించాను. మాజీ గవర్నర్ సల్మాన్ తసీర్‌ను 2011లో మత తీవ్రవాది హత్య చేసిన విధంగానే నన్ను చంపేందుకు ముగ్గురు అత్యున్నత అధికారులు పన్నాగం పన్నారు ’’ అని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.
మొదట తనపై దైవ దూషణ ఆరోపణలు చేశారని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. దీనికి సంబంధించిన టేపులను తయారు చేసి విడుదల చేశారని, దానిని పీఎంఎల్ఎన్ ప్రొజెక్ట్ చేసిందని తెలిపారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో తనకు తెలుసని చెప్పారు. ఇది డిజిటల్ యుగం కాబట్టి దీనిని కనుగొనడం చాలా సులభం అని అన్నారు. మొదటగా తాను మతాన్ని అగౌరవ పరిచానని ప్రచారం చేసి, తరువాత ఓ మత తీవ్రవాది తనను చంపారని చెప్పడం వారి ప్లాన్ అని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.
హమ్మయ్య.. బ్రతికిపోయాం, పసిఫిక్‌లో పడ్డ చైనా రాకెట్ శకలాలు
ఈ మీడియా సమావేశం సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ తన అనుచరులను దేశంలో నిరసనలు కొనసాగించాలని కోరారు. హాస్పిటల్ నుంచి విడుదల అయిన తరువాత ఇస్లామాబాద్ కు పాదయాత్ర చేస్తానని అన్నారు. ఆ ముగ్గురూ (ప్రధాని షెహబాజ్ షరీఫ్, అంతర్గత మంత్రి రాణా సనావుల్లా, మేజర్ జనరల్ ఫైసల్ నసీర్) రాజీనామా చేసేంత వరకు వీధుల్లో నిరసన తెలుపాలని సూచించారు. ‘‘ మీ రాజ్యాంగం మీకు నిరసన తెలిపే హక్కు ఇచ్చింది. మీ మతం అన్యాయానికి వ్యతిరేకంగా జిహాద్ నిర్వహించే హక్కు ఇచ్చింది. ఇది మీ కర్తవ్యం’’ అని ఆయన అన్నారు.
కాగా.. ఇమ్రాన్ ఖాన్ పై దాడికి నిరసనగా ఆయన పార్టీ అయిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ కార్యకర్తలు శుక్రవారం అనేక నగరాల్లో నిరసనలు తెలిపారు. అయితే ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ఏడాది అధికారం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. దీంతో దేశంలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ రాజధాని ఇస్లామాబాద్‌కు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే ఆయనపై ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు.
ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ట్విట్టర్.. ఇండియా మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ టీమ్ సిబ్బందిలో భారీగా కోత
మరోవైపు ఈ కేసును విచారించేందుకు అత్యున్నత స్థాయి జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (జేఐటీ)ని ఏర్పాటు చేయాలని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వాన్ని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు జరిపిన నవీద్ మహ్మద్ బషీర్ అనే వ్యక్తిని పోలీసులు ఘటనా స్థలం నుంచి గురువారం అరెస్టు చేశారు. ఇమ్రాన్ ఖాన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని, అందుకే ఆయనపై దాడి చేశానని నిందితుడు పోలీసుల సమక్షంలో తప్పును అంగీకరించాడు. కాగా నిందితుడికి రూ.20 వేలకు పిస్టల్, బుల్లెట్లను విక్రయించినట్లు భావిస్తున్న మరో ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.