
ప్రపంచానికి పెను గండం తప్పింది . చైనాకు చెందిన లాంగ్ మార్చ్ 5బీ శకలాలు పసిఫిక్ మహాసముద్రంలో పడ్డాయి. దీంతో అన్ని దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఇదే రాకెట్‌కు చెందిన మరో శకలం శుక్రవారం ఉదయం 4.06 గంటల సమయంలో ఈశాన్య పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయినట్లు అమెరికా స్పేస్ కమాండ్ తెలిపింది.
కాగా.. రోదసీలో న్యూ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ నిర్మాణాన్ని చైనా తలపెట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా గత సోమవారం చివరి మాడ్యూల్‌ను ప్రయోగించింది. దాదాపు 23 టన్నుల బరువుండే లాంగ్ మార్చ్ 5 బీ రాకెట్‌తో చేపట్టిన ఈ ప్రయోగం సక్సెస్ అయ్యింది. కానీ .. ఈ రాకెట్ తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుందని .... కొంత భాగం కాలిపోయినప్పటికీ, కొన్ని భాగాలు భూమిపై పడతాయని శాస్త్రవేత్తలు ముందే హెచ్చరించారు. ఈ రాకెట్ దాదాపు 10 అంతస్తుల భవనమంత సైజులో వుంటుంది. దీంతో ఆ శకలాలు ఎక్కడ పడతాయోనని ప్రపంచదేశాలు ఆందోళనకు గురయ్యాయి.
అయితే చైనా రాకెట్‌లు ఇలా భూమ్మీదకు దూసుకురావడం ఇదే తొలిసారి కాదు. గతంలో మూడు రాకెట్లు ఇలాగే భూకక్ష్యలోకి చేరుకున్నాయి. వీటలో ఒకటి మాల్దీవుల సమీపంలో, మిగిలినవి మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ సమీపంలోని సముద్రంలో పడిపోయాయి.