
న్యూఢిల్లీ: ఉక్రెయిన్(Ukraine)పై Russia దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా నిరసించాయి. వెంటనే దాడులు నిలిపేయాలని డిమాండ్ చేశాయి. ఉక్రెయిన్‌పై దాడిని అమెరికా(America), నాటో(NATO) దేశాలే కాదు.. యూరప్‌లోని రష్యా మిత్ర దేశాలు(Russia Allies) కూడా ఖండించాయి. రష్యా రాజకీయ మిత్ర దేశాలుగా పేరున్న హంగరీ, చెక్ రిపబ్లిక్‌లు సహా ఇతర దేశాలూ రష్యా దాడిని వ్యతిరేకించాయి. శాంతి సుస్థిరతలపై రష్యా ప్రభుత్వం నేరానికి పాల్పడిందని చెక్ రిపబ్లిక్ అధ్యక్షుడు మిలోస్ జెమన్ అన్నారు.
ఉక్రెయిన్ నాటో సభ్యత్వం ఇంకా తీసుకోకపోయినా ఆ కూటమిలోని 30 సభ్య దేశాలు ఉక్రెయిన్‌కు పూర్తి మద్దతు ప్రకటించాయి. ఈ పనికి మాలిన యుద్ధాన్ని వెంటనే ఆపేయాలని రష్యాను నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ తెలిపారు. వీరంతా ఒక ఎత్తు అయితే.. ఇంతకు రష్యా మిత్ర దేశాల్లో కీలకంగా ఏవి ఉన్నాయి. ఈ ఘర్షణఫై ఆ మిత్ర దేశాల మాటేమిటో తెలుసుకుందాం.
బెలారస్:
బెలారస్ దేశం ఉక్రెయిన్‌లాగే 1991లో సోవియట్ యూనియన్ కూలడానికి ముందు అందులో భాగంగానే ఉన్నాయి. ఇప్పటికీ ఈ దేశం వేరువడి స్వతంత్రంగా ఉంటున్నప్పటికీ రష్యాకు మద్దతు ఎక్కువ. ఉక్రెయిన్‌పై దాడికి ముందు ఈ దేశంలోనే రష్యా మిలిటరీ డ్రిల్స్ చేపట్టింది. ఉక్రెయిన్ దాడి కోసం ఈ దేశం నుంచి కూడా కొన్ని రష్యా బలగాలను ఉక్రెయిన్‌లోకి పంపినట్టు కథనాలున్నాయి.
చైనా:
రష్యాకు ఆర్థిక సోపతిదారు చైనా. అయితే, ఈ దేశం బహిరంగంగా స్పష్టంగా రష్యాను ఖండించలేదు.. అలాగే మద్దతూ ప్రకటించలేదు. కానీ, రష్యాపై విధిస్తున్న ఆంక్షలను వ్యతిరేకించింది. 2011 నుంచి రష్యాపై అమెరికా 100కు మించిన సార్లు ఆర్థిక ఆంక్షలు విధించిందని గుర్తు చేసింది. ఒక సమస్యను పరిష్కరించడానికి ఆర్థిక ఆంక్షలు ఎప్పుడూ ఒక మౌలిక పరిష్కారం వైపుగా తీసుకెళ్లలేవు అని చైనా సీరియస్ అయింది. అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రతను గౌరవించాల్సిందేనని, కానీ, ఉక్రెయిన్ సమస్య క్లిష్టమైనదని పేర్కొంది. అన్ని వైపుల నుంచి శాంతి చర్చలు జరగడమే దీనికి సరైన పరిష్కారం అని వివరించింది.
సిరియా:
సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఈ నెల 25న మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా చేపడుతున్న మిలిటరీ ఆపరేషన్‌ను సమర్థించారు. సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత ప్రపంచంలో కోల్పోయిన సమతులనాన్ని ఈ సైనిక చర్య మళ్లీ పునరుద్ధరిస్తుందని, ఇది చరిత్రను సరిచేయడమేనని పేర్కొన్నారు. అదే సమయంలో అమెరికా, నాటోల తీరును ఖండించారు.
ఇండియా:
సోవియట్ యూనియన్ కాలం నుంచీ భారత్ రష్యాతో దగ్గరి సంబంధాలను కొనసాగించింది. చైనాలాగే భారత్ కూడా రష్యా సైనిక చర్యను స్పష్టంగా ఖండిచనూ లేదు.. సమర్థించనూ లేదు. ఈ నెల 24న పుతిన్‌తో భారత ప్రధాని మోడీ మాట్లాడారు. రష్యా, నాటో కూటమి మధ్య నెలకొన్న విభేదాలు చర్చల ద్వారానే పరిష్కృతం అవుతాయని సూచించారు. వెంటనే హింసామార్గాన్ని వదిలిపెట్టాలని, అన్ని వైపుల నుంచి దౌత్య మార్గాల్లో, చర్చల ద్వారానూ సమస్యను పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు.
క్యూబా:
ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభానికి ముందు ఈ నెల 23న పుతిన్‌ను క్యూబా సమర్థించింది. కొన్ని వారాలుగా అమెరికా.. రష్యాను రెచ్చగొడుతున్నదని ఆరోపించింది. ఉక్రెయిన్‌ను రష్యా దురాక్రమించే ముప్పు ఉన్నదని అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నదని తెలిపింది. ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగేజ్ తెలిపారు. రష్యా తనను తాను కాపాడుకునే హక్కు కలిగి ఉంటుందనీ అన్నారు. రష్యా దాడులను క్యూబా కూడా స్పష్టంగా సమర్థించలేదు.
వెనెజులా:
దక్షిణ అమెరికాలోని రష్యా మిత్రదేశం వెనెజులా అమెరికా, నాటోల చర్యలను తీవ్రంగా ఖండించింది. అమెరికా ప్రోత్సాహంతో మిన్స్క్ ఒప్పందాన్ని కాలరాసేలా నాటో వ్యవహరిస్తుందని, ఉక్రెయిన్‌లో పరిస్థితులు దిగజారిపోతుండటం ఆందోళనకరంగా ఉన్నదని వెనుజులా విదేశాంగ శాఖ ఈ నెల 24న వెల్లడించింది. మిన్స్క్ ఒప్పందాలను తప్పుదారి పట్టించి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించారని, ఇవి రష్యా ఫెడరేషన్ సమగ్రత, సార్వభౌమత్వానికి ముప్పు తెచ్చిపెట్టే అవకాశం ఉన్నదని తెలిపింది.
ఇరాన్:
ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడానికి కారణంగా నాటో అని ఇరాన్ ఈ నెల 24న ప్రకటించింది. నాటో రెచ్చగొట్టే చర్యల్లోనే ఉక్రెయిన్ సంక్షోభ మూలాలు ఉన్నాయని ఆరోపించింది. అయితే, యుద్ధం ద్వారా ఏ పరిష్కారం లభించదని తాము నమ్ముతామని, వెంటనే కాల్పులను విరమించి, రాజకీయ, ప్రజాస్వామిక పరిష్కారాన్ని చూపడం అవసరం అని తెలిపింది.
పాకిస్తాన్:
ఉక్రెయిన్, రష్యాల మధ్య దాడులు బాధాకరమని, దౌత్యం ద్వారా ఈ పరిస్థితులను అడ్డుకుని ఉండాల్సిందని పాకిస్తాన్ భావించినట్టు పీఎం ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఇలాంటి ఘర్షణలు ఎవరికీ ప్రయోజనం చేకూర్చవని, ఈ దాడులను దౌత్యం, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు ఉపక్రమించినప్పుడు ఇమ్రాన్ ఖాన్ రష్యా పర్యటనలో ఉన్నారు.