
రష్యా దాడితో ఉక్రెయిన్‌లో భీకర పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా నాలుగో రోజు ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుంది. సైనిక స్థావరాలపై ధ్వంసం చేస్తూ, కీలక నగరాలను స్వాధీనం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ (Volodymyr Zelensky) పలు దేశాల సాయం కోరుతున్నాడు. తాజా పరిణామాల నేపథ్యంలో ఉక్రెయిన్ ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రధాన న్యాయ విభాగం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (International Court of Justice) ఆశ్రయించింది. నెదర్లాండ్స్‌లో ఐసీజేలో రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ తన దరఖాస్తును సమర్పించింది. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యా తన చర్యలకు బాధ్యత వహించాలని పేర్కొంది.సైనిక కార్యకలాపాలు నిలిపివేయాలని రష్యాను ఆదేశించేలా అత్యవసర నిర్ణయాన్ని తీసుకోవాలని అభ్యర్థించింది.
‘రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ తన దరఖాస్తును ICJకి సమర్పించింది. దురాక్రమణను సమర్థించేందుకు మారణహోమం భావనను తారుమారు చేసినందుకు రష్యా బాధ్యత వహించాలి. సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని రష్యాను ఆదేశించే అత్యవసర నిర్ణయాన్ని మేము అభ్యర్థిస్తున్నాం. వచ్చే వారం ట్రయల్స్ ప్రారంభమవుతాయని ఆశిస్తున్నాము’ అని జెలెన్ స్కీ తెలిపారు.
ఇక, బెలారస్ వేదికగా రష్యా చర్చలకు ఆహ్వానించడంపై స్పందించిన జెలెన్ స్కీ.. ఆ దేశంలో తాము చర్చలు జరపబోమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై మూడు రోజులుగా జరుగుతున్న దాడుల్లో బెలారస్ కూడా భాగస్వామ్యం పంచుకున్నదని పేర్కొన్నారు. బెలారస్‌లోని గోమెల్‌కు బదులుగా వార్సా, బ్రాటిస్లావా, ఇస్తాంబుల్, బుడాపెస్ట్, బాకు వంటి నగరాలను ప్రత్యామ్నాయ వేదికలుగా తీసుకుని, అక్కడ చర్చలు జరపాలని సూచించారు. రష్యా సూచించిన బెలారస్‌లో చర్చలను ఉక్రెయిన్ అంగీకరించబోదని, మరే నగరంలోనైనా చర్చలకు సిద్ధమేనని వివరించారు.
ప్రపంచ దేశాల నుంచి తమకు అందుతున్న సాయంపై జెలెన్ స్కీ ప్రశంసలు కురిపించారు. తమకు ఆయుధాలు, మందులు, ఆహారం, డీజిల్, డబ్బు అందుతున్నాయని చెప్పారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా శక్తివంతమైన సంకీర్ణం ఏర్పడిందని చెప్పుకొచ్చారు.
ఇక, మరోవైపు రష్యా నాలుగో రోజు ఉక్రెయిన్‌పై యుద్దాన్ని కొనసాగిస్తుంది. పలు నగరాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు దూసుకెళుతుంది. పలునగరాలపై బాంబుల వర్షం కురిపిస్తుంది. రాజధాని కీవ్ నగరంపై మిస్సైల్ దాడులకు పాల్పడింది. ఆదివారం తెల్లవారుజామున ఉక్రెయిన్‌లో రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లో రష్యన్ దళాలు ప్రవేశించాయి. రాత్రిపూట రష్యా బలగాలు జరిపిన దాడులలో ఖార్కివ్ వెలుపల గ్యాస్ పైప్ లైన్‌ను రష్యన్ దళాలు తగలపెట్టాయి. మరోవైపు కీవ్ సమీపంలోని వాసిల్కివ్‌లోని చమురు డిపో రష్యా క్షిపణి దాడితో ధ్వంసమైంది.