హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్‌పై పాకిస్తాన్‌లో దాడి: ఐఎస్ఐ కుట్రగా అనుమానం

By Siva KodatiFirst Published May 29, 2020, 5:50 PM IST
Highlights

కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్‌పై పాకిస్తాన్‌లో దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు

కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్‌పై పాకిస్తాన్‌లో దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే... దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో మే 25 మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో సలావుద్దీన్ ప్రయాణిస్తున్న కారుపై దాడి జరిగింది. ఈ దాడి వెనుక పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఉన్నట్లుగా తెలుస్తోంది.

గతకొంతకాలంగా సయ్యద్‌కు ఐఎస్ఐకి మధ్య మనస్పర్ధలు తలెత్తినట్లుగా సమాచారం. జమ్మూకాశ్మీర్‌లో పెద్ద ఎత్తున ఉగ్రవాదులు హతమవుతుండటంతో పాటు సరిహద్దు గుండా పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు భారత్‌లోకి చొరబడలేకపోవడంతో ఐఎస్ఐ ఆయనపై గుర్రుగా ఉందని సమాచారం.

Also Read:ఇంట్లో కూడా మాస్క్ ధరించాల్సిందేనా..?

దీనికి తోడు కొత్తగా రిక్రూట్‌మెంట్లు లేకపోవడంపై కూడా ఐఎస్ఐ అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. గత 20 సంవత్సరాలుగా సయ్యద్ సలావుద్దీన్‌ను పాక్ పెంచి పోషించింది.

అంతకుముందు హిజ్బుల్ కమాండర్ రియాజ్ నైకూ హతమైనప్పుడు సయ్యద్ సలావుద్దీన్ చేసిన  వ్యాఖ్యలు పాకిస్తాన్ సర్కారుకు ఆగ్రహం తెప్పించినట్లు భావిస్తున్నారు. పాక్ బలహీన విధానాల వల్ల భారత్‌ బలంగా దాడులు చేయగలుగుతోందని సలావుద్దీన్ వ్యాఖ్యానించడమే అతడిపై దాడికి కారణమని రక్షణ నిపుణులు అనుమానిస్తున్నారు.

Also Read:కరోనా కాలంలో ఒక్కటైన డాక్టర్, నర్స్

కాగా 1946 ఫిబ్రవరి 18న జమ్మూకాశ్మీర్‌లోని బద్గామ్‌లో జన్మించిన సయ్యద్ సలావుద్దీన్ కాశ్మీర్ యూనివర్సిటీలో ఎంఏ చదివాడు. కాశ్మీర్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత ఉగ్రవాదంపైపు ఆకర్షితమై.. పాక్‌కు మకాం మార్చాడు. భారత్‌లో కల్లోలం రేపేందుకు ప్రతినిత్యం కుట్రలు పన్నేవాడు.

కాశ్మీరీ యువకులను పెద్దసంఖ్యలో ఉగ్రవాద గ్రూపుల్లో చేర్పించడం, సరిహద్దు దాటించడం, భారత సైన్యంపై పెద్ద ఎత్తున దాడులు చేయించడం వంటి వాటికి వ్యూహాలు రచించేవాడు. మరోవైపు సలావుద్దీన్ కుమారులంతా జమ్మూకాశ్మీర్‌లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఒకరు ప్రభుత్వ ఉద్యోగి కూడా.

click me!