ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం ఏదో తెలుసా? భారత్ ఏ స్థానంలో నిలిచిందంటే ?

By Rajesh KarampooriFirst Published Mar 21, 2023, 7:24 AM IST
Highlights

World Most Happiest Country 2023: ప్రపంచంలోనే అత్యంత సంతోష‌క‌ర‌మైన‌ దేశంగా మరోసారి ఫిన్లాండ్‌ నిలిచింది. ప్రపంచ సంతోకరమైన దేశాల జాబితాలో వరుసగా ఆరోసారి ఈ ఘ‌న‌త ద‌క్కించుకుంది. 

World Most Happiest Country 2023: ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితా వచ్చింది. ఈ జాబితాలో మరోసారి ఫిన్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. గత 6 సంవత్సరాలుగా ఫిన్లాండ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతూ తన ప్రత్యేకతను చాటుకుంది.యూఎన్‌ సస్టెయినబుల్‌ డెవల్‌పమెంట్‌ సొల్యూషన్స్‌ నెట్‌వర్క్ 150కిపైగా దేశాల్లో ప్ర‌జ‌ల‌ను స‌ర్వే చేసి ఈ రిపోర్ట్ రూపొందించింది.

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం, గాలప్ వరల్డ్ పోల్ ఆధారంగా ఈ నివేదిక తయారు చేయబడింది. అయితే ఆసియా దేశాలకు ఈ నివేదిక నిరాశ కలిగిస్తోంది. మొదటి 20 సంతోషకరమైన దేశాల జాబితాలో ఒక్క ఆసియా దేశం కూడా స్థానం దక్కించుకోకపోవడం గమనార్హం. మొదటి 20 సంతోషకరమైన దేశాలలో ఫిన్లాండ్‌తో పాటు డెన్మార్క్, ఐస్‌లాండ్, స్వీడన్ మరియు నార్వే వంటి దేశాలు ఉన్నాయి.

ఏ ప్రాతిపదికన ఈ జాబితాను ప్రకటించారు?

ప్రపంచంలోని సంతోషకరమైన దేశాల జాబితాను రూపొందించేటప్పుడు.. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్.. ఆ దేశాల ప్రజల జీవనశైలి,జీడీపీ, సామాజిక మద్దతు, ఆరోగ్యకరమైన జీవన విధానం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి వంటి తదితరాల అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ప్రాతిపదికన వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఈసారి కూడా ఫిన్‌లాండ్‌ను తన ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో ఉంచింది. 2018 నుంచి వరుసగా ఫిన్‌లాండ్ మొదటి స్థానంలో నిలవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అయితే, ఈ నివేదిక దిగువన చూస్తే.. ఆఫ్ఘనిస్తాన్ 137వ స్థానంలో అట్టడుగున నిలిచింది.  

ఫిన్లాండ్  ప్రత్యేకత ఏమిటి ?

వాస్తవానికి, ఫిన్లాండ్ వంటి  యూరప్ దేశాలు ప్రజల జీవనశైలి,జీడీపీ, సామాజిక మద్దతు,  జీవన విధానం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి తదితరాల విషయాలలో మెరుగ్గా ఉన్నాయి. ఫిన్లాండ్ లో కూడా  జిడిపి, జీవనశైలి, విద్య, ఆరోగ్యం, సామాజిక మద్దతు , అవినీతి చాలా మెరుగైన స్థాయిలో ఉన్నాయి. ఆ దేశంలో చాలావరకు పూర్తిగా ఉచిత విద్య, మంచి ఆరోగ్యం, జీవనశైలి, అనేక అంశాలపై ఫిన్‌లాండ్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుంది. అంటే..అక్కడి ప్రజలు తమ జీవితాలను మెరుగుపర్చుకోవడానికి ఎంత ఎక్కువ ప్రయత్నాలు చేస్తారో, అక్కడి ప్రభుత్వం కూడా తన ప్రజల జీవితాలను మెరుగుపర్చడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంది. అందుకే గత 6 సంవత్సరాలుగా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్‌లో ఫిన్‌లాండ్ నంబర్ వన్ స్థానంలో నిలుస్తుంది. 

126వ స్థానంలో భారత్..

ప్రపంచ సంతోషదాయక దేశాల జాబితాలో భారత్ 126వ స్థానంలో నిలిచింది. గతం కంటే భారత్ మెరుగు సాధించినట్లుగా తెలుస్తోంది. ఈ జాబితాలో భారత్ కంటే పొరుగుదేశాలు నేపాల్, చైనా, శ్రీలంక ముందున్నాయి.అలాగే ప్ర‌స్తుతం యుద్ద దేశాలు అయిన ర‌ష్యా 72, ఉక్రెయిన్ 92వ స్థానలు దక్కడం గమన్హారం. అన్నింటికంటే దిగువన 137వ స్థానంలో అఫ్ఘానిస్థాన్ నిలిచింది.

టాప్ 20 జాబితాలో నిలిచిన దేశాలు 

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం.. ఈ జాబితాలో ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలువగా.. డెన్మార్క్ రెండవ స్థానంలో, ఐస్ లాండ్ మూడో స్థానంలో, ఇజ్రాయెల్ నాలుగో స్థానంలో, నెదర్లాండ్స్ ఐదవ స్థానంలో, స్వీడన్ ఆరో స్థానంలో, నార్వే ఏడవ స్థానంలో ఉన్నాయి. , స్విట్జర్లాండ్ ఎనిమిదో స్థానంలో, లక్సెంబర్గ్ తొమ్మిదో స్థానంలో, న్యూజిలాండ్ 10వ స్థానంలో, ఆస్ట్రియా 11వ స్థానంలో, ఆస్ట్రేలియా 12వ స్థానంలో, కెనడా 13వ స్థానంలో, ఐర్లాండ్ 14వ స్థానంలో, యునైటెడ్ స్టేట్స్ 15వ స్థానంలో, జర్మనీ 16వ స్థానంలో, బెల్జియం 17వ స్థానంలో, చెక్ రిపబ్లిక్ 18వ స్థానంలో, యునైటెడ్ కింగ్‌డమ్ 19వ స్థానంలో, లిథువేనియా 20వ స్థానంలో నిలిచాయి.  

వాస్తవానికి సంతోషంగా ఉండటం అంటే..  సంపదను కలిగి ఉండటమో..సర్వసౌఖ్యాలు ఉండటమో కాదు. సంతోషంగా ఉండటం అంటే మానసిక ప్రశాతంత కలిగి ఉండటం. ఆ విషయాన్ని ఫిన్లాండ్ ను చూసి నేర్చుకోవాలి. వరుసగా ఆరోసారి కూడా చిన్నదేశమైన ఫిన్లాండ్ నిలువడం గమనించాల్సిన విషయమే.

click me!