
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ‘గోల్డ్ కార్డ్’ పేరుతో ఓ ప్రత్యేక ఇమ్మిగ్రేషన్ పథకాన్ని ప్రకటించారు. ఇది ఓ కొత్త రకం పర్మనెంట్ రెసిడెన్సీ (స్థిర నివాసం) ప్రోగ్రామ్. ఇందులో భాగంగా 5 మిలియన్ డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 41 కోట్లు చెల్లించి అమెరికాలో స్థిర నివాసం పొందొచ్చు. దీనికి సంబంధించి trumpcard.gov అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
ఈ గోల్డ్ కార్డ్ ద్వారా తక్షణ పౌరసత్వం లభించదు. ఇది కేవలం పౌరసత్వం దిశగా తీసుకెళ్లే మార్గం మాత్రమే. ట్రంప్ ప్రకారం, ఇది సాధారణ గ్రీన్ కార్డ్ కంటే మెరుగైనది. ముఖ్యంగా ధనవంతులు లేదా ప్రత్యేక ప్రతిభ ఉన్నవారు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.
ప్రస్తుతం గోల్డ్ కార్డుల అమ్మకాలు ప్రారంభం కాలేదు. అయితే ఆసక్తి ఉన్నవారు trumpcard.gov వెబ్‌సైట్‌కి వెళ్లి తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. “అందుబాటులోకి వచ్చిన వెంటనే మీకు సమాచారం అందిస్తారు.” అనే మెసేజ్ హోమ్‌పేజీలో కనిపిస్తోంది.
EB-5 వీసా ద్వారా అమెరికాలో స్థిర నివాసం పొందాలంటే కనీసం $800,000 నుండి $1.05 మిలియన్ వరకు పెట్టుబడి పెట్టాలి. అంతేకాకుండా అది కనీసం 10 అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాలి. కానీ గోల్డ్ కార్డ్‌లో అటువంటి షరతులు లేవు. కేవలం డబ్బు చెల్లించడంతోనే పర్మనెంట్ రెసిడెన్సీకి మార్గం కలుగుతుంది.
ఈ పథకాన్ని ముఖ్యంగా ధనవంతుల కోసం రూపొందించారు. పెద్ద మొత్తంలో డబ్బు పెట్టేవారు, అమెరికాలో స్థిరంగా నివసించాలనుకునే వారు, త్వరగా రెసిడెన్సీ పొందాలనుకునే వారు ఈ మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఉద్యోగ కల్పన అవసరం లేకపోవడంతో ఇది మరింత ఆకర్షణీయంగా మారింది.