శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తివేత.. వెనక్కి తగ్గని నిరసనకారులు

By Mahesh KFirst Published May 21, 2022, 6:07 PM IST
Highlights

శ్రీలంకలో విధించిన ఎమర్జెన్సీని ప్రెసిడెన్షియల్ సెక్రెటేరియట్ ఎత్తేసినట్టు ప్రకటన విడుదల చేసింది. నెల వ్యవధిలోనే రెండు సార్లు ఎమర్జెన్సీ విధించిన శ్రీలంక చివరిసారి మే 6వ తేదీన ఎమర్జెన్సీ విధించింది. శనివారం నుంచి దేశంలో ఎమర్జెన్సీ ఎత్తేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
 

న్యూఢిల్లీ: శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తేశారు. శుక్రవారం అర్ధరాత్రి (శనివారం) నుంచి ఎమర్జెన్సీని ఎత్తేశారు. ఎమర్జెన్సీ విధించి రెండు వారాలు గడిచిన సందర్భంలో గొటబాయ రాజపక్స ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం పరాకాష్టకు చేరింది. విదేశీ మారక నిల్వలు పూర్తిగా కరిగిపోవడంతో పౌరుల అవసరాలకు సరిపడా సరుకులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోలేకపోతున్నది. ఈ నేపథ్యంలోనే సామాన్య ప్రజలు రాజపక్స కుటుంబంపై తీవ్ర అసహనంతో ఉన్నారు. వారి కుటుంబం కారణంగానే శ్రీలంకలో దుస్థితి ఏర్పడిందని వారు ఆగ్రహంతో ఉన్నారు. నెల వ్యవధిలోనే శ్రీలంకలో రెండు సార్లు ఎమర్జెన్సీ విధించారు. తాజా ఎమర్జెన్సీ మే 6వ తేదీన విధించారు. మళ్లీ శనివారం నుంచి ఎమర్జెన్సీని ఎత్తేసినట్టు శ్రీలంక ప్రెసిడెన్షియల్ సెక్రెటేరియట్ ఎమర్జెన్సీని ఎత్తేస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు. 

ప్రధానమంత్రి మహింద రాజపక్స, అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ఇతర మంత్రులు రాజీనామా చేయాలని, ఈ ప్రభుత్వం వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైందని ప్రజలు ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. నిరసనకారులు రోడ్డెక్కారు. కనిపించిన అధికారిక పార్టీ నేతలను నిలదీశారు. కొన్నిసార్లు దాడులు కూడా జరిగాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స శ్రీలంక దీవి దేశంలో ఎమర్జెన్సీ విధించాడు. నిరసనకారులను అరెస్టు చేయడానికి, అదుపులోకి తీసుకోవడానికి ఈ ఎమర్జెన్సీ పోలీసులకు విశేష అధికారాలను ఇచ్చింది. తాజాగా, పరిస్థితులు కొంత అదుపులోకి వచ్చాయన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. అందుకే ఈ ఎమర్జెన్సీ ఎత్తేస్తున్నట్టు ప్రకటించింది.

అయితే, ఇప్పటికీ అంటే, ఎమర్జెన్సీ ఎత్తేసినప్పటికీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సపై వ్యతిరేకత మాత్రం అలాగే ఉన్నది. వందలాది మంది విద్యార్థులు.. అధ్యక్షుడిగా గొటబాయ రాజపక్సను డిమాండ్ చేస్తూ తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. చమురు కోసం కుటుంబ సభ్యులు బారులు తీయడం, దీర్ఘకాలం విద్యుత్ కోతలు, ఆహార, ఔషధాల కొరత వంటి సమస్యలు ప్రజలున ఆందోళనలు కొనసాగించడానికే ప్రేరేపిస్తున్నాయి.

విదేశీ మారక నిల్వలు, ఆర్థిక సవాళ్లు ఎదురుకావడంతో శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ వీలైనంత విదేశీ ధన సహాయం పొందింది. కానీ వాటిని చెల్లించే అవకాశం కనిపించలేదు. దీంతో విదేశీ రుణాలపై దివాళా ప్రకటించింది.

click me!