26 కరోనా కేసులు నమోదైతే.. రాత్రికి రాత్రే 13వేల మంది క్వారంటైన్‌కు.. బందీఖానాగా చైనా రాజధాని!

By Mahesh KFirst Published May 21, 2022, 1:28 PM IST
Highlights

చైనాలో కరోనా మహమ్మరి తొలిసారి వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అత్యధికంగా కేసులు ఇప్పుడే నమోదువుతున్నాయి. అయితే, జీరో కోవిడ్ పాలసీ నిర్వహిస్తుండటంతో నిర్ణయాలు కఠినంగా ఉంటున్నాయి.
 

న్యూఢిల్లీ: కరోనా వైరస్ తొలిసారి చైనాలోనే వెలుగు చూసిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ఇతర దేశాలకు వేగంగా పాకింది. చైనా కంటే కూడా దారుణమైన నష్టాలను కలుగ చేసింది. ఒక్క దేశంలో ఐదారు వేవ్‌లు కూడా వచ్చి వెళ్లిపోయాయి. పెద్ద సంఖ్యలో ప్రాణనష్టాన్ని సృష్టించింది. కానీ, తొలి కేసు రిపోర్ట్ చేసిన చైనాలో ఇంత దారుణ పరిస్థితులేమీ లేవు. కానీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొంత ఉపశమనం కనిపిస్తున్న తరుణంలో చైనాలో తీవ్ర గందరగోళం మొదలైంది. చైనాలో ఎప్పుడూ లేనన్ని కేసులు ఇప్పుడు నమోదు అవుతున్నాయి. మొన్నటికి మొన్న షాంఘై నగరాన్ని కొవిడ్ మహమ్మారి అతలాకుతలం చేసింది. చైనా కూడా జీరో కోవిడ్ పాలసీని పాటిస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నది. షాంఘైలో లాక్‌డౌన్‌లో ఉన్న ప్రజలు తమ జీవితాల్లోనే కఠోర క్షణాలను గడిపారు. ఎంతో  మంది మానసికంగా కుంగిపోయారు. అపార్ట్‌మెంట్ల నుంచి భయానకంగా అరుపులు వేసిన వీడియోలు అప్పుడు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు షాంఘై పరిస్థితులే చైనా రాజధాని బీజింగ్‌లోనూ రిపీట్ అయ్యే ముప్పు కనిపిస్తున్నది. బీజింగ్‌లో కరోనా కట్టడికి అధికారులు కఠోర నిర్ణయాలు తీసుకుంటున్నారు. తత్ఫలితంగా చైనా రాజధాని బందీఖానాగా మారుతుందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

స్వల్ప సంఖ్యలో కేసులు రిపోర్ట్ అయినా.. ఆ ఏరియా చుట్టుపక్కల్లో ఉన్న వేలాది మందిని రాత్రికి రాత్రే అక్కడి నుంచి క్వారంటైన్ హోటళ్లకు తరలిస్తున్నారు. బీజింగ్‌లోని నాంగ్జిన్యూన్ రెసిడెన్షియల్  కాంపౌండ్‌లో శుక్రవారం 26 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అంతే.. అధికారులు రాత్రికి రాత్రే ఆ ఏరియా నుంచి సుమారు 13 వేల మందిని క్వారంటైన్‌కు తరలించింది. బహుశా వారం రోజులు వారిని లాక్‌డౌన్‌లో ఉంచుతుందనే అభిప్రాయాలు వస్తున్నాయి. దయచేసి తమతో సహకరించాలని, లేదంటే చట్టబద్ధమైన తర్వాతి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు. చాలా మంది తమ ఇళ్లను వదిలిసే అత్యవసరాలు చేతపట్టుకుని ప్రభుత్వం తరలించడానికి సద్ధంగా ఉంచిన వాహనాల్లోకి ఎక్కారు. 

ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, ప్రభుత్వ సర్క్యూలర్‌లపై సోషల్ మీడియాలో బలమైన చర్చ జరుగుతున్నది. అయితే, ఆ చర్చ చైనాలో ట్విట్టర్ వంటి యాప్ వీబోలో జరుగుతున్నది. అందులో కొందరు తమ గోడు వెళ్లబోసుకుంటూ.. తమను ఏప్రిల్ 23వ తేదీ నిర్బంధంలో ఉంచారని, పలుమార్లు తమకు కరోనా టెస్టులు చేసినా.. నెగెటివ్ వచ్చినప్పటికీ అధికారులు గదికే పరిమితం చేశారని మండిపడ్డారు. నాంగ్జిన్యూన్ కాంపౌండ్‌లోని నివాసులందరినీ అధికారులు బలవంతంగా క్వారంటైన్‌కు పంపారని, ఉదయమే ఆ రెసిడెన్షియల్ కాంపౌండ్‌ను శనివారం ఉద్యమే బ్లాక్ చేసేశారు.

click me!