కరోనాతో తల్లడిల్లుతున్న ఉత్తర కొరియాకు అమెరికా సహాయ హస్తం.. స్పందించని కిమ్

By Mahesh KFirst Published May 21, 2022, 4:47 PM IST
Highlights

కరోనా కేసులతో సతమతం అవుతున్న ఉత్తర కొరియాకు సహాయం అందించడానికి ప్రయత్నించామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. కానీ, ఉత్తర కొరియా నుంచి స్పందన రాలేదని వివరించారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ ప్రకటన చేశారు.
 

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఇంకా పలు దేశాల్లో ప్రళయం సృష్టిస్తున్నది. ముఖ్యంగా చైనా, ఉత్తర కొరియా దేశాల్లో విశ్వరూపం చూపిస్తున్నది. చైనా కఠిన చర్యలు తీసుకుంటూ కరోనా కట్టడికి ప్రయత్నిస్తున్నది. పైగా ఇక్కడ చాలా మంది కరోనా టీకా వేసుకున్నవారే ఉన్నారు. కానీ, ఉత్తర కొరియా పరిస్థితి పూర్తిగా విరుద్ధం. ఇప్పటి వరకు అక్కడ కరోనా టీకా వేసింది లేదు. ఏ పెద్ద వ్యాధి వచ్చినా ఎదుర్కొనే వ్యవస్థ లేదు. ఐసీయూ, ఇతర ఆరోగ్య వసతులు సరిగా లేవు. అదీగాక, ఇది వరకు చైనా సహా ఇతర కొన్ని దేశాలు టీకాలు పంపడానికి ఆఫర్ ఇచ్చినా ఉత్తర కొరియా దేశం తిరస్కరించింది. అయితే, అప్పుడు కరోనా కేసులు రిపోర్ట్ కాలేవు. కానీ, ఇప్పుడు ఉత్తర కొరియా కరోనా కేసులతో తల్లడిల్లుతున్నది. ఇప్పుడు సహాయ హస్తం చాచినా స్పందన రాకపోవడం గమనార్హం.

ఉత్తర కొరియా, అమెరికా అంటే ఎప్పుడూ ఉప్పు, నిప్పు అన్నట్టుగా ఉంటాయి. కానీ, సంక్షోభ సమయాల్లో ఒక దేశానికి మరో దేశం ఆదుకోవడం అవసరం. అందుకే కరోనా కేసులతో సతమతం అవుతున్న ఉత్తర కొరియాకు టీకాలు అందించాలని ప్రయత్నించామని, కానీ, ఉత్తర కొరియా నుంచి ఎలాంటి స్పందన రాలేదని యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.

ఉత్తర కొరియాకే కాదు.. చైనాకు కూడా టీకాలు అందిస్తామని తాము ఆఫర్ ఇచ్చామని బైడెన్ దక్షి ణ కొరియా రాజధానిలో తెలిపారు. వెంటనే వాటిని అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని వివరించారు. కానీ, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని తెలిపారు. 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దక్షిణ కొరియా పర్యటనలో ఉన్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇరువురూ ఉత్తర కొరియాకు కరోనా సహాయం అందించడానికి సంసిద్ధత ప్రకటించారు. కానీ, ఆ దేశం నుంచి స్పందన రాలేదని వెల్లడించారు.

click me!