
Chinese President Xi Jinping: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ "సెరిబ్రల్ అనూరిజం" (మెదడు సంబంధిత వ్యాధి)తో బాధపడుతున్నారు. చాలా రోజుల క్రితమే ఆయనకు ఈ సెరిబ్రల్ అనూరిజం ఉందని వైద్యులు గుర్తించారని తాజాగా రిపోర్టులు పేర్కొంటున్నాయి. 2021 చివర్లోనే ఆయన దీని చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాల్సి ఉందని సమాచారం. అయితే, దానిని వాయిదా వేసుకున్న ఆయన ఇటీవలే చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. రక్తనాళాలను మృదువుగా చేసి, రక్తనాళాన్ని కుదించేలా చేసే శస్త్రచికిత్సలకు వెళ్లడం కంటే చైనా సంప్రదాయ ఔషధాలతో చికిత్స చేయించుకోవడానికే ఆయన మొగ్గు చూపినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం చైనా సంప్రదాయ వైద్యం తీసుకుంటున్నారు.
చైనా సంప్రదాయ వైద్యం ద్వారా మెదడులోని రక్తపునాళాలు మెత్తబడి వ్యాధి తగ్గే అవకాశాలు ఉన్నాయి. సెరిబ్రల్ అనూరిజం వ్యాధి కారణంగా మెదడులోని ధమనుల్లో వాపు రావడం జరుగుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇది మరింతగా ముదరడం.. సరైన సమయంలో చికిత్స తీసుకోకుంటే ప్రాణాంతకంగా మారుతుందని చెబుతున్నారు. ఇక చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కు సెరిబ్రల్ అనూరిజం ఉందని తెలిసిన తర్వాత.. ఆయన తన ఆరోగ్యంపై మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ వ్యాధి వల్లే ఆయన గత కొన్నాళ్ల నుంచి విదేశీ నేతలను కలవడం లేదని సమాచారం. కోవిడ్19 మహమ్మారి వ్యాప్తి చెందిననాటి నుంచి బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ అయ్యే వరకు ఆయన అన్ని సమావేశాలకు దూరంగా ఉండటానికి ప్రధాన కారణం ఆయన అనారోగ్యమే కారణమని రిపోర్టులు పేర్కొన్నాయి.
అంతకుముందు 2019 మార్చి లో జిన్‌పింగ్ ఇటలీ పర్యటనలో ఆయన ఆరోగ్యంపై అనేక అనుమానాలు కలిగే విధంగా ఉందని వార్తలు వచ్చాయి. ఆయన శరీర కదలికల్లో అసాధారణ చర్యలను గుర్తించారు. తరువాత ఫ్రాన్స్‌లో కూడా అదే పర్యటనలో కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై చర్చ జరిగింది. జిన్‌పింగ్ కూర్చోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అనుచరుల మద్దతు తీసుకోవడం కనిపించింది. అదేవిధంగా, అక్టోబర్ 2020లో షెన్‌జెన్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు.. పూర్తిగా ఆయన ఆరోగ్యం అంత మెరుగ్గా లేదని స్పష్టంగా తెలిసింది. ఆయన నిరసంగా కనిపించడంతో పాటు నెమ్మదిగా మాట్లాడటం మరియు దగ్గుతూ మాట్లాడటంతో మళ్లీ అతని ఆరోగ్యంపై ఊహాగానాలకు దారితీసింది.
ప్రస్తుతం చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా వాణిజ్య గొలుసుకు అంతరాయం ఏర్పడింది. దేశంలో చమురు, గ్యాస్ ధరలపై ప్రభావం పడింది. దీనికి తోడు కరోనా వైరస్ కట్టడి కోసం.. ప్రజల అణిచివేత.. జీరో-కోవిడ్ విధానాన్ని కఠినంగా అమలు చేయడం వల్ల చైనా ఆర్థిక వ్యవస్థ చాలా ఒత్తిడికి లోనవుతున్నదని నివేదికలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఆయన మూడోసారి దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్న తరుణంలో జిన్‌పింగ్ ఆరోగ్యంపై ఈ రిపోర్టులు వెలవడటం సంచలనంగా మారింది. జిన్ పింగ్ ఈ ఏడాది చివర్లో మూడవ ఐదేళ్ల కాలానికి మళ్లీ ఎన్నిక కావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే తన పాలనలో చైనాను మరింత సంపన్నమైన, ప్రభావవంతమైన మరియు స్థిరమైన దేశంగా చిత్రీకరించడానికి ఆయన ప్రయత్నిస్తున్న పరిస్థితులు ఉన్నాయి.