అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్.. నాన్సి పెలోసి తైవాన్ పర్యటిస్తే అమెరికా మూల్యం చెల్లించాల్సిందే

By Mahesh KFirst Published Aug 2, 2022, 4:13 PM IST
Highlights

అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా స్పీకర్ నాన్సి పెలోసి తైవాన్ పర్యటిస్తే యూఎస్ భారీ మూల్యం చెల్లించాల్సిందేనని హెచ్చరించింది. పెలోసి పర్యటన చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యమేనని స్పష్టం చేసింది.
 

న్యూఢిల్లీ: యూఎస్ హౌజ్ స్పీకర్ నాన్సి పెలోసి తైవాన్ పర్యటనపై చైనా, అమెరికాల మధ్య సంబంధాలు ప్రమాదంలో పడ్డాయి. నాన్సి పెలోసి తైవాన్ పర్యటనను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఒక వేళ నాన్సి పెలోసి తైవాన్ పర్యటిస్తే మాత్రం అమెరికా కచ్చితంగా భారీ మూల్యం చెల్లించాల్సిందేనని చైనా విదేశాంగ ప్రతినిధి హువా చున్‌యింగ్ తెలిపారు. చైనా సార్వభౌమత్వ భద్రతా ప్రయోజనాలను తక్కువ చేస్తే మాత్రం అమెరికా అందుకు బాధ్యత వహించాలని, మూల్యం చెల్లించాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు.

చైనా అమెరికా సంబంధాలకు వన్ చైనా నిబంధన అనేది ఒక రాజకీయ పునాది వంటిదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ షియాజిన్ ట్వీట్ చేశారు. తైవాన్ స్వాతంత్ర్యం వైపుగా వేర్పాటువాద చర్యలు తీసుకుంటే చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. తైవాన్ స్వాతంత్ర్యం కోసం జరిగే ఏ ప్రయత్నాన్ని అయినా తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. అమెరికా స్పీకర్ పెలోసి తైవాన్ పర్యటన చైనా అంతర్గత వ్యవహారాల్లో తీవ్ర జోక్యమేనని పేర్కొన్నారు. చైనా, అమెరికాల మధ్య సంబంధాలను దెబ్బతీయడానికి తీసుకున్న నిర్ణయంగానే భావిస్తామని వివరించారు. ఇది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని, వాటిని అమెరికా భరించాల్సి ఉంటుందని ట్వీట్ చేశారు. ఈ పర్యటన తర్వాత ఏర్పడే పరిస్థితులకు, పరిణామాలకు అమెరికా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు.

The one-China principle is the political foundation for China-US relations. China firmly opposes separatist moves toward “Taiwan independence” and interference by external forces, and never allows any room for “Taiwan independence” forces in whatever form.

— Wang Xiaojian (@ChinaSpox_India)

చైనా, తైవాన్ మధ్య ఘర్షణాయుత వాతావరణం దశాబ్దాలుగా కొనసాగుతున్నది. తాము స్వతంత్రంగా ఉంటామని తైవాన్ ప్రకటిస్తుండగా.. లేదు.. తైవాన్ తమలో అంతర్భాగం అని చైనా వెల్లడిస్తూ వస్తున్నది. అంతేకాదు, మరే దేశ ప్రతినిధులు కూడా తైవాన్‌ను ప్రత్యేకంగా పర్యటిస్తే చైనా కన్నెర్ర చేస్తుంది. వివాదం మొదలవుతుంది. ఈ సారి వివాదానికి అమెరికా సెనేటర్ నాన్సి పెలోసి కేంద్రంగా ఉన్నారు.

నాన్సి పెలోసి తైవాన్ పర్యటన షెడ్యూల్ జరుగుతుండగానే చైనా అభ్యంతరం తెలిపింది. నిప్పుతో చెలగాటం ఆడొద్దని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ నేరుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఫోన్‌లో హెచ్చరించారు. కానీ, ఆ షెడ్యూల్ ఖరారు అయింది. మంగళవారం రాత్రి నాన్సి పెలోసి తైవాన్ రాబోతున్నారు.

click me!