అమెరికా వర్సెస్ తాలిబాన్.. ఒకరిపై ఒకరు మాటలతో దాడి.. ఖండనలు.. సమర్థనలు

By Mahesh KFirst Published Aug 2, 2022, 12:55 PM IST
Highlights

అమెరికా యూఎస్ డ్రోన్ దాడిలో అల్ ఖైదా చీఫ్ అమాన్ అల్ జవహిరి హతమయ్యాడు. ఈ విషయాన్ని బైడెన్ స్వయంగా వెల్లడించారు. ఈ దాడి చుట్టూ అమెరికా, తాలిబాన్ల మధ్య మాటలు పెరుగుతున్నాయి. అమెరికా దాడిని తాలిబాన్లు ఖండించారు. అల్ ఖైదా నేతకు ఆశ్రయం ఇచ్చి తాలిబాన్లు తప్పు చేశారని అమెరికా పేర్కొంది.
 

న్యూఢిల్లీ: అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ చీఫ్ అమాన్ అల్ జవహిరిని అమెరికా మట్టుబెట్టింది. తాలిబాన్ పాలనలోని అఫ్ఘనిస్తాన్‌లో తలదాచుకున్న అల్ జవహిరిని అమెరికా డ్రోన్ దాడిలో హతమార్చింది. ఆయన ఆచూకీ విజయవంతంగా కనుక్కున్న అమెరికా ఇంటెలిజెన్స్ సీఐఏ ఈ ఆపరేషన్ చేపట్టింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా వెల్లడించారు. తన ఆదేశాల మేరకు అల్ ఖైదీ చీఫ్ అల్ జవహిరిని హతమార్చినట్టు ఆయన తెలిపారు. ఈ ఎలిమినేషన్‌తో అమెరికా ప్రజలకు న్యాయం అందించినట్టు అయిందని వివరించారు. అయితే, ఈ దాడిపై అమెరికా, తాలిబాన్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

అఫ్ఘనిస్తాన్‌లో యూఎస్ డ్రోన్ దాడిని తాలిబాన్ ఖండించింది. కాబూల్‌లోని ఓ నివాసంపై అమెరికా డ్రోన్ దాడి చేపట్టిందని తాలిబాన్ ప్రధాన ప్రతినిది సోమవారం అన్నారు. తాలిబాన్ స్పోక్స్‌మన్ జబిహుల్లా ముజాహిద్ ఓ ప్రకటన విడుదల చేశారు. యూఎస్ డ్రోన్ దాడి ఆదివారం చోటుచేసుకుందని వివరించారు. ఇది అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనే అని ఆరోపించారు. అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణపై 2020లో కుదిరిన ఒప్పందాన్ని కూడా యూఎస్ ఉల్లంఘించిందని పేర్కొన్నారు.

కాగా,  అమెరికా ఈ దాడిని సమర్థించుకుంది. అల్ ఖైదా టాప్ లీడర్‌కు ఆశ్రయం ఇచ్చి తాలిబాన్లు దోహా ఒప్పందాన్ని దారుణంగా ఉల్లంఘించారని పేర్కొంది. తాలిబాన్లు వారు ఇచ్చిన హామీలకు కట్టుబడకుంటే.. వాటిని అమలు చేయడానికి నిరాకరిస్తే తాము అఫ్ఘాన్ ప్రజలకు మద్దతుగా నిలబడుతూనే ఉంటామని అమెరికా రక్షణ మంత్రి ఆంటోని బ్లింకెన్ సోమవారం అన్నారు. మానవ హక్కులు, ముఖ్యంగా మహిళలు, బాలికల హక్కుల రక్షణ కోసం అమెరికా పాటుపడుతుందని వివరించారు. అఫ్ఘాన్ ప్రజలకు వేగంగా సహకారం అందించడానికి సిద్ధంగా ఉంటుందని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.

9/11 అమెరికాపై దాడి చేసిన అల్ ఖైదాను తుదముట్టించాలని యూఎస్ ప్రతిన బూనింది. ఇందులో భాగంగానే 2011లో అల్ ఖైదా అప్పటి చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చింది. ఒసామా బిన్ లాడెన్‌ను తమకు అప్పగించనందుకే అమెరికా ట్రూపులు అప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌ను పాలిస్తున్న తాలిబాన్లపై దాడుల పరంపర ప్రారంభించింది. ఆ తర్వాత తాలిబాన్లు అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఎన్నికల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ట్రూపులను ఉపసంహరించాలని అమెరికా భావించింది. కానీ, తాలిబాన్ల బెడదతో ఆ ఎన్నికల ప్రభుత్వం నిలువలేకపోయింది. మళ్లీ తాలిబాన్లు అధికారాన్ని చేపట్టారు. తాజాగా, మరోసారి అల్ ఖైదా చీఫ్‌ను అమెరికా హతమార్చడం హాట్ టాపిక్‌గా మారింది.

click me!