చైనాలో రోజుకు 6.30 లక్షల కేసుల ముప్పు.. ‘ఆంక్షలు ఎత్తేసే ఆలోచనల్లేవ్’

By telugu teamFirst Published Nov 28, 2021, 5:15 PM IST
Highlights

అమెరికా, యూకే, ఇతర పాశ్చాత్య దేశాల తరహాలోనే చైనా కూడా ఆంక్షలు సడలిస్తూ వెళితే తీవ్ర పరిణామాలు వస్తాయని ఓ అధ్యయనం వెల్లడించింది. యూఎస్ ఎంచుకున్న దారిలోనే నడిస్తే చైనాలో రోజుకు సుమారు 6.30 లక్షల కేసులు నమోదయ్యేవని పెకింగ్ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది. దీంతో చైనాలో ఇప్పట్లో ఆంక్షలు ఎత్తేసే ఆలోచనలు లేవని ఆ దేశ పత్రిక కథనాలు పేర్కొన్నాయి.
 

న్యూఢిల్లీ: 2019లో తొలిసారి కరోనా కేసు(Corona Cases) Chinaలో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఇతర దేశాలకూ వేగంగా వైరస్ వ్యాపించింది. ఆ తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కరోనా వైరస్‌ను మహమ్మారి అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అత్యధిక జనాభాతో జనసాంధ్రత అధికంగా ఉన్న చైనాలో వైరస్ వేగంగా వ్యాపించే ముప్పు ఎక్కువ. కానీ, చైనా ప్రభుత్వం మొదటి నుంచీ కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నది. ఒక్కోసారి ప్రజలను ఇంటి బయట కూడా అడుగుపెట్టనివ్వకుండా డోర్లు మూసేసిన ఉదంతాలు ఉన్నాయి. అధికార యంత్రాంగమే ఆయా కుటుంబాలకు అవసరమైన ఆహారాన్ని అందిస్తూ ఇంటి బయట నుంచి డోర్లను మూసేసిన సందర్భాలు ఉన్నాయి. కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రకంపనలు పుట్టిస్తుండటంతో చైనా ఈ ఆంక్షలను ఎత్తేసే అవకాశం లేదని తెలుస్తున్నది. దీనికి మరో కారణంగా కూడా ఉన్నది. అమెరికా, ఇంగ్లాండ్, ఇతర పాశ్చాత్య దేశాల తరహాలో ఆంక్షలు(Restrictions) ఎత్తేస్తూ సేవలను అందుబాటులోకి తెస్తే  చైనాలో ఒక్క రోజుకు గరిష్టంగా కేసులు సుమారు 6.30 లక్షలు నమోదయ్యేవని ఓ అధ్యయనం(Study) వెల్లడించింది.

చైనా అనుసరించే జీరో టాలరెన్స్ పద్ధతిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఉన్నాయి. అంటే ఒక్క కేసు నమోదైనా కఠిన చర్యలు తీసుకోవడం, ఒక్క కేసు నమోదు కాకుండా ఆంక్షలు విధించే విధానం. ఒక వేళ చైనా ప్రభుత్వం నిజంగానే ఈ జీరో టాలరెన్స్ పద్ధతిని వదిలిపెడితే ఆ దేశంలో రోజుకు 6,30,000 కేసులు నమోదయ్యేవని పెకింగ్ యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు ఓ అధ్యయనంలో వెల్లడించారు. ఈ దేశంలో శనివారం కొత్తగా 23 కేసులు నమోదయ్యాయి. ఇందులో విదేశాల నుంచి వచ్చిన వారిలో కనిపించినవే 20 కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ దేశంలో 98,631 కేసులు నమోదవ్వగా, 4,636 మంది ఈ మహమ్మారి కారణంగా మరణించారు.

Also Read: కరోనా ముప్పు ముగియలేదు.. జాగ్రత్తగా ఉండండి: మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ

చైనాకు చెందిన ఉన్నత శ్వాసకోశ నిపుణులు జోంగ్ నాన్షన్ మాట్లాడుతూ, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం కలిగి ఉన్నదని, దాన్ని ఎదుర్కోవడం సవాళ్లతో కూడుకున్న పని అని తెలుస్తున్నదని అన్నారు. ఈ వేరియంట్‌తో ఎక్కువ ఉత్పరివర్తనాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వయంగా వెల్లడించిందనీ పేర్కొన్నారు. ఇప్పటి వరకు చైనాలో 76.8శాతం మంది జనాభాకు టీకా వేశామని, ఈ సంఖ్య 80శాతం చేరితే హెర్డ్ ఇమ్యూనిటీ సాధించే అవకాశం ఉన్నదని తెలిపారు.

కరోనాను మహమ్మారిగా పేర్కొన్నప్పటి నుంచి చైనా ఇప్పటికీ విమాన సేవలను పూర్తిగా అందుబాటులోకి తేలేదు. ఇంకా చాలా ఆంక్షలు అమలు చేస్తున్నది. ఒకవేళ చైనా ప్రభుత్వం ఇతర పాశ్చాత్య దేశాల్లాగే ఆంక్షలను సడలిస్తే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉండేవని పెకింగ్ యూనివర్సిటీకి చెందిన మ్యాథమెటీషియన్ వెల్లడించారు. ఆయన ఆగస్టు నెలలో యూఎస్, బ్రిటన్, ఇజ్రాయెల్, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లోని పరిణామాలను పరిశీలించి ఈ అంచనా వెల్లడించారు. ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా 21 రోజులు గుర్తించిన హోటల్స్‌లో క్వారంటైన్‌లో ఉండాలనే ఆదేశాలున్నాయి.

Also Read: Omicron: బెంగళూరు విమానాశ్రయంలో ఇద్దరు దక్షిణాఫ్రికా పౌరులకు కరోనా పాజిటివ్.. అప్రమత్తమైన అధికారులు

అమెరికా దారిలో ఆంక్షలు ఎత్తేసి ఉంటే చైనాలో రోజుకు 6,37,155 కేసులు నమోదయ్యేవని ఆయన అధ్యయనం వెల్లడించింది. ఆ నెలలో అమెరికాలో రోజుకు సుమారు 1.50 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అదే బ్రిటన్ దారిలో వెళ్తే రోజుకు 2,75,793 కేసులు, ఫ్రాన్స్ తరహాలోనే ఆంక్షలు ఎత్తేస్తే రోజుకు 4,54,198 కేసులు చైనాలో నమోదయ్యేవని అంచనా వేసింది. కాబట్టి, ఇతర దేశాల తరహాలోనే ఆంక్షలు ఎత్తేయాలని ఆత్రుతతో నిర్ణయాలు తీసుకోవడం జరగదని చైనా పత్రికలు వివరించాయి.

ఒమిక్రాన్‌పై తాము దృష్టి సారిస్తున్నామని చైనా అతిపెద్ద టీకా తయారీదారు సినోవాక్ బయోటెక్ తెలిపింది. ఒమిక్రాన్‌పై సమాచారం, ఈ మ్యూటెంట్ వైరస్‌కు సంబంధించిన శాంపిళ్ల కొరకు అంతర్జాతీయ భాగస్వాములతో చర్చిస్తున్నట్టు వివరించింది.

click me!