Omicron: వణుకు పుట్టిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్.. ఒమిక్రాన్‌ అని పేరు పెట్టిన WHO.. డెల్టా కంటే డెంజర్!

By team telugu  |  First Published Nov 27, 2021, 10:04 AM IST

ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగుచూసి కోవిడ్ కొత్త వేరియంట్ B.1.1.529కు డబ్ల్యూహెచ్‌వో (World Health Organization).. ఒమిక్రాన్ (Omicron) అని పేరు పెట్టింది. అంతేకాకుండా ఈ వేరియంట్‌ను అత్యంత సమస్యసాత్మక కోవిడ్-19 వేరియంట్ల జాబితాలో దీనిని చేర్చింది. 
 


కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ దేశాల గుండెల్లో దడ పుట్టిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల దక్షిణాఫ్రికాలో తొలిసారిగా కనుగొన్న ఈ కోవిడ్ కొత్త వేరియంట్ B.1.1.529కు డబ్ల్యూహెచ్‌వో.. ఒమిక్రాన్  (Omicron) అని పేరు పెట్టింది. అంతేకాకుండా ఈ వేరియంట్‌ను అత్యంత సమస్యసాత్మక కోవిడ్-19 వేరియంట్ల జాబితాలో దీనిని చేర్చింది. దీనిని వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌‌గా (Variant Of Concern) ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రెకేత్తించిన డేల్టాను కంటే ఇది డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు. 

‘COVID-19 ఎపిడెమియాలజీలో (epidemiology) హానికరమైన మార్పును సూచించే సాక్ష్యాధారాల ఆధారంగా... ప్రపంచ ఆరోగ్య సంస్థ B.1.1.529ని వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌గా గుర్తించింది. దీనిని Omicron అని పిలుస్తారు’ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా ఈ వేరియంట్‌లో పెద్ద సంఖ్యలో ఉత్పరివర్తనాలు ఉండడం ఆందోళన కలిగించే అంశమని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అందులో కొన్ని ఉత్పరివర్తనాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయని తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ ఎంత ప్రభావం చూపిస్తుందన్నది తెలుసుకోవాలంటే కొన్ని వారాల సమయం పడుతుందని చెప్పింది.

Latest Videos

undefined

ఇదివరకే కరోనా నుంచి కోలుకున్నవారికి కూడా ఈ వేరియంట్ సోకే ప్రమాదం ఉందని ప్రాథమిక ఆధారాలు సూచిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దక్షిణాఫ్రికాలోని దాదాపు అన్ని ప్రావిన్స్‌లలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు కనిపిస్తోందని వెల్లడిచింది. 

Also read: కరోనా కొత్త వేరియంట్ కలకలం.. దక్షిణాప్రికా ప్రయాణాలపై యూరప్ బ్యాన్.. డబ్ల్యూహెచ్‌వో భేటీ

కొద్ది రోజుల కిందట దక్షిణాఫ్రికా‌లో (South Africa) సేకరించిన నమునాలో B.1.1.529 వేరియంట్ వెలుగుచూసింది. సౌతాఫ్రికాలో ఇప్పటికే వందకు పైగా ఒమిక్రాన్ కేసులు గుర్తించారు. ఆ తర్వాత హాంకాంగ్, బోట్సోవానా, ఇజ్రాయెల్, బెల్జియంలోనూ ఈ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న తరుణంగా ఒమ్రికాన్ వేరియంట్.. ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తుందనే చెప్పాలి. ఇది ఏ రకంగా వ్యాప్తి చెందుతుందనే ఆందోళన కనిపిస్తుంది.

ఒమిక్రాన్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు పలు దేశాలు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టాయి. రాత్రికి రాత్రే ఒమిక్రాన్‌ గుర్తింపబడిన దేశాలకు విమానాల రాకపోకలపై నిషేధం విధించాయి. బ్రిటన్‌, సింగపూర్‌, మలేషియా, జపాన్‌, ఇజ్రాయెల్‌ ముందుజాగ్రత్తగా దక్షిణాఫ్రికా, బోట్స్వానా, నమీబియా, జింబాబ్వే, ఎస్వతిని, లెసొతో దేశాల విమాన సర్వీసులపై తాత్కాలిక నిషేధాన్ని ప్రకటించింది. మరోవైపు యూరోపియన్ యూనియన్ కూడా ఎయిర్ ట్రావెల్ బ్యాన్‌కు సంబంధించి సభ్య దేశాలతో చర్చలు జరుపుతుంది. ఇందుకు సంబంధించి త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉంది. 

మరోవైపు ఈ వేరియంట్‌ భయాందోళనల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు, చమురు ధరలు పడిపోయాయి.  కరోనా తర్వాత ఇప్పడిప్పుడే కొలుకున్న ఆర్థిక వ్యవస్థకు ఇలాంటి పరిణామాలు మరింత దెబ్బ తీసే అవకాశం ఉన్నట్టుగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. 

అప్రమత్తమైన భారత ప్రభుత్వం..
బి.1.1.529 కరోనా వేరియంట్ కేసులు బయటపడ్డ నేపథ్యంలో భారత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. విదేశాల నుండి మరీ ముఖ్యంగా south africa తో పాటు హాంకాంగ్, బోట్స్ వానా దేశాల నుండి భారత్ కు విచ్చేసే ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా వుండాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర  వైద్యారోగ్య శాఖ హెచ్చరించింది. ఈ మేరకు union health department secretary రాజేశ్‌ భూషణ్‌ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. బి.1.1.529 కరోనా వేరియంట్ ప్రమాదకరంగా మారి మరోసారి ప్రజారోగ్యంపై సవాల్ విసిరే ప్రమాదముందని ఈ లేఖ ద్వారా రాష్ట్రాలకు హెచ్చరించారు.

click me!