హలో.. మీకు కొత్తగా పెళ్లైందా..? పిల్లల్ని ఎప్పుడు కంటున్నారు? నవదంపతులకు ఫోన్లు చేసి మరీ ఆ పని చేయమంటున్న చైనా

By Mahesh KFirst Published Oct 28, 2022, 8:07 PM IST
Highlights

చైనా ఇప్పుడు జననాల రేటు పెంచడానికి ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం ఏకంగా నవ దంపతులకు ఫోన్లు చేసిన మరీ ఎప్పుడు పిల్లలను కంటున్నారు? అంటూ ఆరా తీస్తున్నది. ఏడాదిలోపు పిల్లలను కనాలని కోరుతున్నది.
 

న్యూఢిల్లీ: చైనాలో విచిత్ర పరిస్థితి ఏర్పడింది. జనాభా నియంత్రణ కోసం జననాల రేటుపై షరతులు పెట్టిన చైనా.. ఇప్పుడు మళ్లీ జననాల రేటు పెంచడానికి ఆపసోపాలు పడుతున్నది. జననాల రేటు పెంచడానికి ఎంత తపించిపోతున్నదంటే.. పెళ్లి అయిందని తెలియగానే నవదంపతులకు ఫోన్లు చేసి మరీ పిల్లల్ని ఎప్పుడు కంటున్నారు? అని ఆరా తీస్తున్నది. త్వరగా గర్భం కోసం ప్లాన్ చేసుకోవాలనీ చెబుతున్నది. ఇది వింతగా అనిపిస్తున్నా.. నిజం.

ఒక ఆన్‌లైన్ పోస్టు ఈ విషయాన్ని వెల్లడించింది. చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబోలో కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి ఈ కామెంట్ చేశారు. తనకు స్థానిక ప్రభుత్వ అధికారి నుంచి ఫోన్ వచ్చిందని ఆమె తెలిపారు. ఆమె గర్భం దాల్చిందా లేదా? అని తెలుసుకోవడానికే ఫోన్ చేశారని పేర్కొన్నారు. ఈ పోస్టుపై వేలాది కామెంట్లు వచ్చాయి. ఆ తర్వాత ఆమె తన పోస్టు డిలీట్ చేశారు. చాలా మంది నెటిజన్లు తాము కూడా అలాంటి ఫోన్ కాల్స్ ఎదుర్కొన్నామని కామెంట్లు చేశారు.

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ గత వారం చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ కాంగ్రెస్‌లో కీలక ప్రకటన చేశారు. చైనాలో జననాల రేటును పెంచే విధానం చేపడుతామని వివరించారు. తద్వార దేశ జనాభాను మెరుగుపరుస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె పోస్టు పెట్టడం గమనార్హం. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రకటన చేసిన తరుణంలో స్థానిక అధికారులు ఇందుకు ఉపక్రమించినట్టు తెలుస్తున్నది.

Also Read: హాంకాంగ్‌పై చైనా పూర్తి నియంత్రణ సాధించిందన్న జీ జిన్‌పింగ్.. తైవాన్ విషయంలో కీలక వ్యాఖ్యలు..

వీబోలో ఓ యూజర్ తన ఫ్రెండ్ ఎక్స్‌పీరియన్స్‌ను పోస్టు చేశారు. నాంజింగ్ సిటీ గవర్నమెంట్ విమెన్స్ హెల్త్ సర్వీస్ నుంచి ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చిందని వివరించారు. స్థానిక అధికారి ఆమెతో ఇలా మాట్లాడారని పేర్కొన్నారు. ‘నవ దంపతులు ఏడాది లోపు గర్భం దాల్చాలి. ప్రతి మూడు మాసాలకు ఒకసారి ఫోన్ చేయడం మా బాధ్యత’ అని వారు తన ఫ్రెండ్‌తో పేర్కొన్నట్టు పోస్టు పెట్టారు. కొన్ని గంటల తర్వాత ఈ పోస్టును తొలగించారు.

1980 నుంచి 2015 వరకు వన్ చైల్డ్ పాలసీని చైనా అమల్లోకి తెచ్చింది. ఆ తర్వాత తమ పాపులేషన్‌లో ఒక సమస్య తలెత్తుతున్నట్టు చైనా కనుగొంది. వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండగా.. వారిని సంరక్షించే, పోషించే నవతరం సరిపడా లేదనే విషయాన్ని తెలుసుకుంది. ఈ తరుణంలోనే మళ్లీ జననాల రేటు పెంచాలని ప్రజలను కోరుతున్నది.

కరోనా, జీరో కోవిడ్ పాలసీ వంటి వాటితో చైనా ప్రజలు సంతానంపై ఆశలనే దాదాపుగా వదిలేశారని కొందరు చెప్పారు.

click me!