
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పై ప్రశంసలు కురిపించారు. మాస్కోకు చెందిన వాల్డాయ్ డిస్కషన్ క్లబ్‌లో గురువారం మాట్లాడారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వతంత్ర విదేశాంగ విధానాలు చేపడుతున్నారని పొగిడారు. ఆయన సారథ్యంలో ఎంతో కృషి జరిగిందని వివరించారు. ఆయన దేశభక్తుడు అని వివరించారు.
పీఎం మోడీ భారత దేశభక్తుడు అని, ఆయన మేక్ ఇన్ ఇండియా ఆలోచన ఆర్థికంగానూ, నైతికంగానే గొప్ప నిర్ణయం అని వివరించారు. భవిష్యత్ భారత దేశానిదే అని తెలిపారు. అంతేకాదు, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం కావడం ఆ దేశ గర్వించదగింది అని రష్యన్ భాషలో ఆయన పేర్కొన్నట్టు రాయిటర్స్ ట్రాన్స్‌లేషన్‌లో వివరించింది.
బ్రిటీష్ వారికి వలసగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి ఆధునిక ప్రభుత్వం వరకు భారత దేశం ఘనమైన అభివృద్ధి సాధించిందని అన్నారు. సుమారు 150 కోట్ల జనాభా, కచ్చితమైన అభివృద్ధి కార్యాలు చూసే ప్రపంచం భారత్‌ను గౌరవిస్తుందని తెలిపారు.
భారత్, రష్యాల మధ్య సంబంధాలను పేర్కొంటూ ఈ రెండు దేశాల మధ్య దశాబ్దాల తరబడి మంచి సాన్నిహిత్యం ఉన్నదని వివరించారు. ఒక దేశం అంటే మరో దేశం గౌరవిస్తుందని, ఈ రెండు దేశాల సంబంధాల మధ్య సమస్యలు ఏమీ రాలేవని తెలిపారు. ఒకరికి మరొకరు మద్దతుగా నిలబడతారని పేర్కొన్నారు. ఇదే వైఖరి భవిష్యత్‌లోనూ కొనసాగుతుందని అన్నారు.
Also Read: ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడి.. ఒకే సారి 36 రాకెట్ల ప్రయోగం.. చీకట్లోకి 1.5 లక్షల మంది..
భారత సాగు పరిశ్రమ కోసం అత్యంత ముఖ్యమైన ఎరువుల సరఫరాను పెంచాలని ప్రధాని నరేంద్ర మోడీ తనను అడిగారని వ్లాదిమిర్ పుతిన్ వివరించారు. ఈ సరఫరాలను సుమారు 7.6 రెట్లు పెంచామని తెలిపారు. సాగులో వాణిజ్యం దాదాపు రెండింతలకు మించిందని చెప్పారు.
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ఎనిమిది నెలలుగా కొనసాగుతూనే ఉన్నది. ఈ యుద్ధ తీవ్రత పెంచిన తరుణంలో భారత్ పై రష్యా ఈ ప్రశంసలు చేయడం గమనార్హం.
అదే సందర్భంలో పశ్చిమ దేశాలపై ఆయన విరుచుకుపడ్డారు. పశ్చిమ దేశాలు డర్టీ గేమ్స్ ఆడుతున్నాయని మండిపడ్డారు. బహుళపక్ష ప్రపంచంలో కొత్త శక్తులు ఏర్పడి తీరుతాయని అన్నారు. అప్పుడు పశ్చిమ దేశాలు కూడా సమానత్వం గురించి మాట్లాడక తప్పదని వివరించారు. ప్రపంచాన్ని శాసించాలనే ఆలోచన నుంచి పశ్చిమ దేశాలు ఈ గేమ్ ఆడుతున్నాయని, ఇది ప్రమాదకరమైనదని, రక్తపాతంతో నిండినదని పేర్కొన్నారు. వారి విలువలు, విజనే సార్వజనీనమైనవని రుద్దే ఈ దేశాలు ఇతరులనే కాదు.. స్వయంగా వారి దేశాల ప్రజలనూ దోపిడీ చేస్తాయని అన్నారు. వాటికవే శక్తిహీనులుగా మారుతాయని చెప్పారు.