బుర్కినా ఫాసో మరోసారి తిరుగుబాటు.. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టినట్టుగా ప్రకటించిన సైనికులు..

By Sumanth KanukulaFirst Published Oct 1, 2022, 11:25 AM IST
Highlights

పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో మరోసారి సైనిక తిరుగుబాటు జరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో తిరుగుబాటు చేసి అధికారంలోకి వచ్చిన జుంటా నాయకుడు పాల్-హెన్రీ సండోగో దమీబాను పడగొట్టిన మిలటరీ అధికారులు..  బుర్కినా ఫాసోను స్వాధీనం చేసుకున్నారు.

పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో మరోసారి సైనిక తిరుగుబాటు జరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో తిరుగుబాటు చేసి అధికారంలోకి వచ్చిన జుంటా నాయకుడు పాల్-హెన్రీ సండోగో దమీబాను పడగొట్టిన మిలటరీ అధికారులు..  బుర్కినా ఫాసోను స్వాధీనం చేసుకున్నారు. రాజధాని ఔగాడౌగౌలో శుక్రవారం తెల్లవారుజామున అధ్యక్ష భవనం చుట్టూ కాల్పులు వినిపించాయి. దీంతో స్టేట్ బ్రాడ్‌కాస్టర్ సేవలు నిలిచిపోయాయి. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో.. అలసటతో ఉన్న డజనుకు పైగా సైనికులు స్టేట్ టెలివిజన్ అండ్ రేడియో బ్రాడ్‌కాస్టర్‌లో కనిపించారు. 

జిహాదీ తిరుగుబాటును అరికట్టడంలో విఫలమైనందుకు లెఫ్టినెంట్-కల్నల్ పాల్-హెన్రీ సండోగో దమీబాను తొలగించినట్లు వారు తెలిపారు. వారు 34 ఏళ్ల కెప్టెన్ ఇబ్రహీం ట్రార్‌ను ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించారు. ‘‘"మా భూభాగం భద్రత, సమగ్రతను పునరుద్ధరించడం అనే ఒకే ఆదర్శంతో నడిచే మా బాధ్యతలను తీసుకోవాలని మేము నిర్ణయించుకున్నాము’’ అని వారు చెప్పారు. అయితే అందులో చాలా మంది మాస్క్‌లు ధరించి ఉన్నారు. 

ఇక, ఎన్నికైన అధ్యక్షుడు రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోర్..  జిహాదీలను తిప్పికొట్టడంలో విఫలమయ్యారని ఆరోపించిన తర్వాత దమీబా ఈ ఏడాది జనవరిలో తనను తాను దేశ నాయకుడిగా నియమించుకున్నారు. ఇప్పడు మరోసారి అక్కడ సైనిక తిరుగుబాటు జరిగింది. కొత్త నాయకుడు ట్రౌర్ విషయానికి వస్తే.. ఆయన గతంలో కయా ఉత్తర ప్రాంతంలోని జిహాదీ వ్యతిరేక ప్రత్యేక దళాల విభాగం "కోబ్రా"కు అధిపతిగా ఉన్నారు.

బుర్కినా ఫాసో‌లో ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో కొంతకాలంగా తీవ్ర హింస చోటుచేసుకుంది. జనవరి 24న దేశ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పుడు భద్రతకు తాను ప్రాధాన్యతనిస్తానని దమీబా వాగ్దానం చేసినప్పటికీ.. మార్చి నుంచి హింసాత్మక దాడులు పెరిగాయి. ఉత్తర, తూర్పు ప్రాంతాల్లోని వంతెనలను పేల్చివేసి, సరఫరా కాన్వాయ్‌లపై దాడి చేసిన తిరుగుబాటుదారులు పట్టణాలను దిగ్బంధించారు. సరిహద్దు దేశాలలో మాదిరిగానే.. అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ గ్రూపుతో అనుబంధంగా ఉన్న తిరుగుబాటుదారులు అశాంతిని రేకెత్తించారు. గత నెలలో చోటుచేసుకున్న పేలుడులో 35 మంది మృతిచెందారు. 

click me!