ఉక్రెయిన్ ఆక్రమణను ఖండించిన ఐరాస తీర్మానం ముసాయిదాపై ఓటేయని భారత్

By Mahesh KFirst Published Oct 1, 2022, 4:10 AM IST
Highlights

ఉక్రెయిన్‌లోని నాలుగు భూభాగాలను తనలో కలుపుకుంటున్నట్టు రష్యా ఇటీవలే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే రష్యాకు వ్యతిరేకంగా అమెరికా, అల్బేనియా ఓ తీర్మాన ముసాయిదాను ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టాయి. కాగా, భారత్ ఈ తీర్మానానికి దూరంగా ఉన్నది.
 

న్యూఢిల్లీ: ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి భారత్ దూరంగా జరిగింది. ఉక్రెయిన్‌కు చెందిన నాలుగు భూభాగాలను ఆక్రమిస్తూ రష్యా వెలువరించిన ప్రకటనను ఖండిస్తూ అమెరికా, అల్బేనియా ఓ తీర్మాన ముసాయిదాను ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టాయి. కానీ, ఈ ముసాయిదా తీర్మానంపై భారత్ ఓటేయలేదు.

ఐరాస భద్రతా మండలిలోని 15 దేశాలు అమెరికా, అల్బేనియా దేశాలు ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానంపై ఓటేశాయి. ఉక్రెయిన్‌కు చెందిన దొనెత్స్క్, లుహాన్స్క్, ఖెర్సాన్, జపోరిఝియాలను రష్యా ఆక్రమించుకోవడం, అక్రమంగా రెఫరెండం నిర్వహించడాన్ని అవి ఖండిస్తూ ఈ తీర్మానం ప్రవేశపెట్టాయి. అయితే, ఈ తీర్మానం నెగ్గలేదు. ఎందుకంటే రష్యా వీటో చేసింది. 15 దేశాల భద్రతా మండలిలో పది దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. నాలుగు దేశాలు మాత్రం ఓటింగ్‌కు దూరంగా నిలిచాయి.

ఇప్పటికే రష్యా తన ఆక్రమణ గురించి ప్రకటించి ఉన్నది. దొనెత్స్క్, లుహాన్స్క్, ఖెర్సాన్, జపోరిఝియాలను ప్రజా అభిప్రాయాన్ని సేకరించి తమలో విలీనం చేసుకుంటున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. ఈ ప్రకటనపై యూఎన్ సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ స్పందించారు.

గురువారం ఈ విషయం ఆయన మాట్లాడుతూ, ఒక దేశం.. మరో దేశ భూభాగాన్ని ముప్పు తలపెట్టి లేదా బలగాల ప్రయోగం ద్వారా ఆక్రమించుకోవడం యూఎన్ చార్టర్ నిబంధనలు, అంతర్జాతీయ చట్టం ఉల్లంఘనలే అని అన్నారు.

దొనెత్స్క్, లుహాన్స్క్, ఖెర్సాన్, జపోరిఝియాల ఆక్రమణకు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి న్యాయపరమైన విలువ ఉండదు అని వివరించారు. కచ్చితంగా అలాంటి నిర్ణయాలు ఖండనార్హమైనవే అని పేర్కొన్నారు.

అంతర్జాతీయ న్యాయ చట్రంలో దీన్ని పరిగణనలోకి తీసుకోలేమని, అంతర్జాతీయ సమాజ వైఖరికి వ్యతిరేకమైనదని ఆయన విమర్శించారు. ఐరాస నిబంధనలు, పర్పస్‌ను బేఖాతరు చేస్తున్నదని రష్యాపై విమర్శలుగుప్పించారు. ఇది యుద్ధానికి ఆధునిక యుగంలో తావు లేదని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేం అని వివరించారు. 

ఇప్పటికీ రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య  యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.

click me!