
ఫ్రాన్స్ అంతటా "బ్లాక్ ఎవ్రీథింగ్" పేరుతో ప్రారంభమైన నిరసనలు భారీ హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు బస్సులు, వాహనాలను తగలబెట్టగా, రోడ్లను దిగ్బంధించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్ వాడుతూ, బారికేడ్లను తొలగించి శాంతి భద్రతలను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు.
నిరసనలు ప్రారంభమైన కొన్ని గంటల్లోనే దాదాపు 200 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెన్నెస్ నగరంలో బస్సును తగలబెట్టగా, దక్షిణ పశ్చిమ ఫ్రాన్స్‌లో పవర్ లైన్ ధ్వంసమై రైలు సర్వీసులు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా 80,000 మందికి పైగా పోలీసులను మోహరించారు. హింసాత్మక ఘటనలు మరింత విస్తరించకుండా కఠిన చర్యలు చేపట్టినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రి బ్రూనో రెటైలు తెలిపారు.
ఈ నిరసనల దెబ్బతో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. అవిశ్వాస తీర్మానంలో ఓడిన ఫ్రాంకోయిస్ బేరు ప్రధాని పదవిని వదిలేయాల్సి వచ్చింది. ఆయన స్థానంలో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రక్షణ మంత్రిగా పనిచేసిన సెబాస్టియన్ లెకార్నును కొత్త ప్రధానమంత్రిగా నియమించారు.
39 ఏళ్ల సెబాస్టియన్ లెకార్ను ఫ్రాన్స్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన రక్షణ మంత్రిగా నిలిచారు. ఇప్పుడు ఆయన నాల్గవ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అనంతరం 2030 నాటికి ఫ్రాన్స్ రక్షణ వ్యవస్థను బలపరచే ప్రణాళికలో కీలక పాత్ర పోషించారు. మాక్రాన్‌కు అత్యంత విశ్వసనీయుడైన ఆయన ఇప్పుడు దేశంలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవాల్సి ఉంది.
ఆందోళనకారులు ప్రధానిగా నియమితులైన లెకార్నుపై కూడా ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఆయన స్పందిస్తూ ప్రజల ఆవేదనను అర్థం చేసుకుంటామని, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ, నిరసనకారుల దూకుడు, దేశవ్యాప్తంగా భద్రతా చర్యలు ఫ్రాన్స్‌ను ఉద్రిక్తతలోకి నెడుతున్నాయి.