ట్రంప్ నిర్ణయానికి బైడెన్ చెక్.. ! అలా కుదరదంటూ ప్రకటన..

By AN TeluguFirst Published Jan 19, 2021, 10:23 AM IST
Highlights

అగ్రరాజ్యం అమెరికాలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు యూరప్, బ్రెజిల్ ప్రయాణికులపై విధించిన ఆంక్షలను ట్రంప్ తొలగిస్తూ తీసుకున్న నిర్ణయంతో తమకు సంబంధం లేదని, తాము ఎట్టిపరిస్థితుల్లో ఈ బ్యాన్‌ను తొలగించబోమని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ స్పష్టం చేసింది. ట్రంప్ నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రకటన చేసిన కాసేపటికే బైడెన్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకి ఈ కీలక ప్రకటన విడుదల చేశారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో యూరప్, బ్రెజిల్ ప్రయాణికుల రాకపై విధించిన ఆంక్షలను జనవరి 26 నుంచి ఎత్తివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన ఆ ప్రకటనను నూతన అధ్యక్షుడు బైడెన్ బృందం తోసిపుచ్చింది. 

"వైద్య బృందం సూచన మేరకు మా అడ్మినిస్ట్రేషన్ 26 నుంచి ఆంక్షలను ఎత్తివేయడం లేదు. ఇంకా చెప్పాలంటే అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించాం. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రయాణాల ఆంక్షలు వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 

ముఖ్యంగా అగ్రరాజ్యంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అందులోనూ కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. కనుక ఆంక్షల తొలగింపు విషయంలో అచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది." అని జెన్ సాకి అన్నారు. 

కొవిడ్ వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో ఉన్నందున విమాన  ప్రయాణికులకు కొవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి చేయాలని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ట్రంప్, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటనలు వెలువడడం గమనార్హం. 

ఇక బుధవారం అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న బైడెన్.. ప్రధానంగా మహమ్మారి అంతమొందించే దిశగా చర్యలు తీసుకోనున్నారని ఇప్పటికే స్పష్టం అవుతోంది. తన పాలనలో తొలి 100 రోజుల్లో 100 మిలియన్ల మందికి వ్యాక్సిన్ అందించడం, అలాగే 100 రోజుల పాటు మాస్క్ ధరించడం తప్పనిసరి చేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు బైడెన్ ఇప్పటికే ప్రకటించారు.     
 
click me!