కమలా హారిస్ చీర కట్టుకుంటారా..? సూట్ వేసుకుంటారా..? ఇదే చర్చ..!

By telugu news teamFirst Published Jan 19, 2021, 9:31 AM IST
Highlights

ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తున్నప్పుడు కమలా హ్యారిస్.. తన భారతీయ మూలాలను పదే పదే ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో.. ఆమె చీర కట్టుకొని ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ప్రచారం మొదలైంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించారు. రెండు రోజుల్లో ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయనతో పాటు ఉపాధ్యక్షురాలిగా భారతీయ సంతతి మహిళ కమలా హారిస్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా... ఈ ప్రమాణస్వీకారం రోజున కమలాహారిస్ ఏం ధరిస్తారు అనే విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.

ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తున్నప్పుడు కమలా హ్యారిస్.. తన భారతీయ మూలాలను పదే పదే ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో.. ఆమె చీర కట్టుకొని ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ప్రచారం మొదలైంది.

ఎన్నికల ప్రచార సమయంలో.. గెలిస్తే.. ప్రమాణ స్వీకారం రోజున చీర కట్టుకుంటారా అనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. అయితే.. దానికి ఆమె సమాధానంగా.. ముందు గెలుద్దాం.. ఆ తర్వాత చూద్దాం అనే సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా భారతీయ సంస్కృతి, వారసత్వం పట్ల తమకు ఎంతో గౌరవం అని.. తమను తమ తల్లి అలా పెంచారని ఆమె పేర్కొన్నారు. ఇంటి పేరుతో సంబంధం లేకుండా అన్ని పండగలు తాము జరుపుకుంటామని కూడా చెప్పారు. కమల తల్లి శ్యామలా గోపాలన్ చెన్నైలో పుట్టి పెరిగి.. అమెరికా వలస వెళ్లారు. ఈ నేపథ్యంలో భారతీయ సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ.. చీర ధరిస్తే.. ఆమెకు మద్దతు మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ప్రమాణస్వీకారం రోజున కమలా హారిస్ ఏం వస్త్రాలు ధరిస్తారనే చర్చ అంత ముఖ్యమైందా? కాదా అనేది పక్కనబెడితే.. చీరను ధరించడం బైడెన్-హారిస్ పాలన మైనారిటీలకు మంచి ప్రాతినిధ్యం వహిస్తుందనే ఉద్దేశ్యంతో ఒక ముఖ్యమైన సందేశాన్ని బలంగా పంపుతుందని కొందరు అంటున్నారు.

‘ప్రమాణస్వీకారం సమయంలో మేడం వైస్‌-ప్రెసిడెంట్‌ చక్కటి బెనారస్‌ పట్టుచీరలో కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు’న్యూయార్క్‌లో స్థిరపడి ఒడిశా సంతతికి చెందిన ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ బిబు మొహాపాత్ర ఓ ఇంటర్వూలో చెప్పారు. ఈ సందర్భంలో ఆమెకు వస్త్రాలంకరణ చేయటం తనకు ఎంతో గౌరవం కూడా అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీంతో కమల ‘ఆరుగజాల వస్త్ర విశేషం’ అయిన చీరనే ధరిస్తారనే ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.


అయితే, ఈ రాజకీయవేత్త వాస్తవానికి ఎన్నో ఏళ్లుగా ఫార్మల్‌ సూట్లనే ధరిస్తున్నారు.. ఇప్పుడు కూడా ఆమె అదే అలవాటును కొనసాగిస్తారనే వారూ ఉన్నారు. ఇక ఆమె ఏం ధరిస్తారనేది అంత ముఖ్య విషయం కాదని కొందరంటున్నారు. 

click me!