బ్యాంక్ చోరీకి ఉబర్ ట్యాక్సీలో వెళ్లిన దొంగ.. ఇంటికి తీసుకెళ్లడానికి బయటే వెయిట్ చేయించాడు

By Mahesh KFirst Published Nov 21, 2022, 5:17 PM IST
Highlights

అమెరికాలో ఓ వ్యక్తి బ్యాంకు దొంగిలించడానికి ఉబర్ ట్యాక్సీలో వెళ్లాడు. బ్యాంకు ముందుకు చేరిన తర్వాత మళ్లీ వచ్చే వరకు వెయిట్ చేయాలని, తనను ఇంటి వద్ద దిగబెట్టాలని డ్రైవర్‌ను కోరాడు. ఆ తర్వాత బ్యాంకులోకి వెళ్లి గన్ తీసి చోరీ చేసిన తర్వాత ఆ వ్యక్తి మళ్లీ కారులో ఇంటికి వెళ్లిపోయాడు.
 

న్యూఢిల్లీ: బ్యాంకు దొంగిలించడానికి ఒక వ్యక్తి ఉబర్ ట్యాక్సీలో వెళ్లాడు. అంతేకాదు, ఆ వ్యక్తి బ్యాంకులోకి వెళ్లి దొంగిలించి మళ్లీ తిరిగి బయటకు వచ్చే వరకు ఉబర్ ట్యాక్సీని వెయిట్ చేయించాడు. దొంగిలించిన డబ్బుతో ఆ ట్యాక్సీలోనే సదరు వ్యక్తి ఇంటికి వెళ్లిపోయాడు. ఇదంతా ఆ ఉబర్ ట్యాక్సీ డ్రైవర్‌కు తెలియనేలేదు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

ఈ దొంగను జాసన్ క్రిస్మస్‌గా గుర్తించారు. మిషిగాన్ సౌత్‌ఫీల్డ్ నివాసిగా అధికారులు పేర్కొన్నారు. బుధవారం పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. హంటింగ్‌టన్ బ్యాంక్‌లో దొంగతనం చేసిన జాసన్ క్రిస్మస్‌ను అరెస్టు చేసినట్టు సౌత్‌ఫీల్డ్ పోలీసు శాఖ తెలిపింది. ఈ నగరంలో సాయుధ చోరీ ఈ విధంగా చేపట్టడం ఇదే తొలిసారి అని సౌత్‌ఫీల్డ్ పోలీసు చీఫ్ ఎల్విన్ బారెన్ పోలీసులు వివరించారు.

డైలీ స్టార్ కథనం ప్రకారం, ఉబర్ క్యాబ్‌లో క్రిస్మస్ స్పాట్‌కు వెళ్లగానే వెహికిల్ దిగి బ్యాంకు బిల్డింగ్ లోపలికి వెళ్లే సమయంలో మాస్క్ పెట్టుకున్నాడు. లోపటికి వెళ్లిన తర్వాత గన్ తీసి సిబ్బందిని బెదిరిస్త డబ్బులు గుంజాడు. ఆ తర్వాత బయటకు వచ్చి ఎప్పటిలాగే ఉబర్ క్యాబ్ ఎక్కేశాడు. ఆ కారులోనే తన ఇంటికి వెళ్లిపోయాడు.

Also Read: బ్యాంకు నుంచి రూ. 34 కోట్లు చోరీ చేయాలనుకున్నారు.. ఆ డబ్బును మధ్యలోనే ఎందుకు వదిలేశారు?

జాసన్ క్రిస్మస్ బయటకు వెళ్లిపోయిన తర్వాత సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. చోరీకి వచ్చిన దొంగ ఉబర్ కారులో రావడం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆ సీసీటీవీ ఫుటేజీలో ఉబర్ క్యాబ్ నంబర్ ప్లేట్ చూశారు. ఆ నెంబర్ ప్లేట్ ఆధారంగా క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు విచారించారు. తనకు ఆ దొంగతనం గురించి తెలియదని ఉబర్ డ్రైవర్ చెప్పాడు. ఆయన మాటలను క్రాస్ చెక్ చేసిన తర్వాత పోలీసులు జాసన్ క్రిస్మస్ ఇంటికి చేరారు. అపార్ట్‌మెంట్ బిల్డింగ్ బయటే క్రిస్మస్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

42 ఏళ్ల జాసన్ క్రిస్మస్ చేతులకు బేడీలు వేశారు. అయితే, ఆ క్రిస్మస్ బట్టలపై మొత్తం ఎర్రటి రంగు కనిపించింది. అదంతా రక్తాన్ని పోలి కనిపించింది. దీంతో అతనిపై కాల్పులు జరిపారా? అని పోలీసులను ప్రశ్నించారు. కానీ, అది రక్తం కాదని, అది డై అని తేలింది. 

జాసన్ క్రిస్మస్ అసలు ఎందుకు దొంగతనం చేశాడో ఇప్పటికైతే తెలియదని పోలీసు చీఫ్ ఎల్విన్ బారెన్ వివరించారు. హాలీడే సీజన్ వస్తున్నదని, ఈ సమయంలో కొందరు పిచ్చి పనులు చేస్తుంటారని పేర్కొన్నారు.

click me!