ఇండోనేషియాలో భారీ భూకంపం.. 44మంది మృతి.. వందలాది మందికి గాయాలు..

By Sumanth KanukulaFirst Published Nov 21, 2022, 2:29 PM IST
Highlights

ఇండోనేషియాలో భారీ భూకంపం చోటుచేసుకుంది. జావా ద్వీపంలో సోమవారం మధ్యాహ్నం రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది.

ఇండోనేషియాలో భారీ భూకంపం చోటుచేసుకుంది. జావా ద్వీపంలో సోమవారం మధ్యాహ్నం రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 44 మంది మరణించగా... వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. భూప్రకంపనల కారణంగా పెద్ద సంఖ్యలో ఇళ్లు, భవనాలు ధ్వంసం అయ్యాయి. రెస్క్యూ సిబ్బంది సహాయక  చర్యలు కొనసాగిస్తున్నాయి. 

ఇండోనేషియా రాజధాని జకార్తాకు ఆగ్నేయంగా 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న సియాంజూర్‌లో 10 కిమీ (6.2 మైళ్లు) లోతులో భూకంపం సంభవించిందని వెదర్ అండ్ జియోఫిజిక్స్ ఏజెన్సీ (బీఎంకేజీ) తెలిపింది. సునామీ వచ్చే అవకాశం లేదని పేర్కొంది. భూకంపం తర్వాత రెండు గంటల్లో 25 ప్రకంపనలు నమోదయ్యాయని పేర్కొంది. అయితే రికర్ట్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.4గా ఉందని.. జకార్తాకు దక్షిణాన ఉన్న పట్టణాల సమీపంలో సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. 

‘‘నాకు ప్రస్తుతానికి లభించిన సమాచారం ప్రకారం.. ఒక్క ఆసుపత్రిలోనే దాదాపు 20 మంది మరణించారు. కనీసం 300 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో చాలా మందికి భవనాల శిథిలాల కింద చిక్కుకుపోవడంతో గాయాలు అయ్యాయి. ఇది ఒక ఆసుపత్రి నుంచి మాత్రమే. సియాంజూర్‌లో నాలుగు ఆసుపత్రులు ఉన్నాయి’’ అని సియాంజూర్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ హెర్మన్ సుహెర్మాన్ మెట్రో టీవీతో చెప్పారు. స్థానిక నివేదికలను గమనిస్తే మృతులు, గాయపడినవారి సంఖ్య మరింతగా  పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇక, భూకంపం చోటుచేసుకున్న ప్రాంతంలో అనేక గృహాలు, ఒక ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్ దెబ్బతిన్నాయని జాతీయ విపత్తు సంస్థ తెలిపింది. అధికారులు పూర్తి స్థాయిలో నష్టాన్ని అంచనా వేయడం కొనసాగిస్తున్నారని పేర్కొంది. 

ఇదిలా ఉంటే.. సియాంజూర్‌ కొన్ని భవనాలు దాదాపు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయని, ఆందోళన చెందిన నివాసితులు బయట గుమికూడినట్లు పలు మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. 

click me!