వ్యూహాత్మక నగరం మరియుపోల్‌లో 1000 మంది ఉక్రెయిన్ జవాన్ల లొంగుబాటు.. రష్యా టార్గెట్ రీచ్ అయినట్టేనా?

Published : Apr 13, 2022, 03:19 PM IST
వ్యూహాత్మక నగరం మరియుపోల్‌లో 1000 మంది ఉక్రెయిన్ జవాన్ల లొంగుబాటు.. రష్యా టార్గెట్ రీచ్   అయినట్టేనా?

సారాంశం

రష్యా తన మిలిటరీ చర్యలో కీలక లక్ష్యాన్ని సాధించుకుంది. తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా సరిహద్దుకు సమీపంలోని వ్యూహాత్మక పోర్టు నగరం మరియుపోల్‌‌లో వేయికిపైగా ఉక్రెయిన్ జవాన్లు లొంగిపోయినట్టు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ఈ నగరాన్ని రష్యా సుమారు నెల రోజులుగా దాడులతో తన గుప్పిట్లోనే ఉంచుకుంది.  

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలు పెట్టినప్పటి నుంచి దాని ఫోకస్ కీవ్ కంటే కూడా వ్యూహాత్మక పోర్టు సిటీ మరియుపోల్‌పైనే ఉంది. ఈ సిటీపై అధికస్థాయిలో బాంబులతో విరుచుకుపడింది. నిజానికి ఇది కీవ్ కంటే రష్యాకు చాలా సమీపంగా ఉండే నగరం. మరీ ముఖ్యంగా రష్యా స్వతంత్ర ప్రాంతాలుగా ప్రకటించిన దొన్‌బాస్‌లోని రీజియన్‌లకు, గతంలో రష్యా ఆక్రమించుకున్న క్రిమియా ప్రాంతానికి మధ్యలో ఉన్నది. అంటే.. రష్యా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల నడుమ ఉన్న ఈ కీలక పోర్టు నగరాన్ని రష్యా టార్గెట్
చేస్తూ వచ్చింది. 

ఈ మరియుపోల్ నగరం గురించి ఓ వేడి వార్త వెలుగులోకి వచ్చింది. ఈ నగరంలో నెల రోజులుగా రష్యా సైన్యానికి దూరంగా తలదాచుకున్న 1,026 మంది ఉక్రెయిన్ జవాన్లు లొంగిపోయినట్టు ఓ ప్రకటన వచ్చింది. తూర్పు ఉక్రెయిన్‌లోని వ్యూహాత్మక పోర్టు నగరంలో వెయ్యి మంది ఉక్రెయిన్ జవాన్లు లొంగిపోయారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ఈ నగరాన్ని సుమారు నెల రోజులుగా రష్యా తన గుప్పిట్లో పెట్టుకుంది. దీంతో 36వ మెరైన్ బ్రిగేడ్‌కు చెందిన 1,026 మంది రష్యా సైనికులు స్వచ్ఛందంగా చేతులు పైకెత్తి రోడ్డుపై నడుచుకుంటూ వచ్చి లొంగిపోయారని రష్యా ప్రకటించింది. 

చెచెన్ నేత రంజాన్ కాదిరోవ్ మాట్లాడుతూ, మరియుపోల్ నగరంలో వెయ్యి మంది ఉక్రెయిన్ సైనికులు లొంగిపోయారని, అజోవ్‌స్టాల్ స్టీల్ మిల్‌లో దాక్కున్న మిగతా సైనికులనూ లొంగిపోవాలని కోరినట్టు వివరించారు. అజోవ్‌స్టాల్‌లో ప్రస్తుతం కనీసం 200 మంది సైనికులు గాయపడి ఉన్నారని, వారికి ఎలాంటి వైద్య సహాయం అందలేని తెలిపారు. అలాంటి వారితోపాటు మిగతావారు కూడా అనవసరమైన ఈ ప్రతిఘటనకు పూనుకోవడం మానేసి తమ తమ ఇంటికెళ్లి కుటుంబాలతో గడపడం మంచిదని సూచించారు.

ఉక్రెయిన్‌లో నాటో, పశ్చిమ దేశాల ఆయుధాలు పెరుగుతున్నాయని, ఈ మిలిటరీ సామర్థ్యం తమ దేశానికి ముప్పు అని రష్యా భావించింది. ముఖ్యంగా రష్యా పూర్వపు సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా ఉద్భవించిన నాటో కూటమిలో దాని సరిహద్దు దేశం ఉక్రెయిన్ చేరడాన్ని తీవ్రంగా నిరసించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఉక్రెయిన్‌పై ఒత్తిడి పెంచింది. పశ్చిమ దేశాలు, అమెరికాలనూ ఒత్తిడి చేసింది. నాటోలో చేరకుండా ఉండాలని, ఉక్రెయిన్‌లో మిలిటరీ సామర్థ్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో తాము
ఈ ‘మిలిటరీ ఆపరేషన్’ చేపడుతున్నామని రష్యా యుద్ధానికి ముందు మాట్లాడింది. అందుకే తాము ఉక్రెయిన్‌లోని సాధారణ పౌరులను టార్గెట్ చేసుకోవడం లేదని, కేవలం ఉక్రెయిన్ మిలిటరీ స్థావరాలే తమ లక్ష్యం అని ప్రకటించింది.

అయితే, ఈ మిలిటరీ ఆపరేషన్‌కు ముందు తూర్పు ఉక్రెయిన్‌లోని ఎల్పీఆర్, డీపీఆర్ తిరుగుబాటు ప్రాంతాలను స్వతంత్ర ప్రాంతాలుగా రష్యా గుర్తించింది. గతంలోనే రష్యా ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియాను  ఆక్రమించింది. ఇప్పుడు రష్యా గుర్తించిన స్వతంత్ర ప్రాంతాలకు, క్రిమియాకు మధ్యలో ఉన్న కీలకమైన మరియుపోల్ పోర్టు సిటీని తన గుప్పిట్లోకి దాదాపుగా తెచ్చేసుకుంది. ఇప్పటి వరకు రష్యా ఈ యుద్ధంలో సాధించిన అంశాల్లో ఇది తప్పక ఉంటుంది. అయితే, రష్యా టార్గెట్ రీచ్ అయిందా? అంటే ఇప్పుడు స్పష్టంగా
చెప్పలేం. ఎందుకంటే అది బహిరంగంగా ప్రకటించిన లక్ష్యాలు మాత్రం వేరు. ఈ యుద్ధంపై రష్యా అధికారిక ప్రకటన చేసే వరకు అది మరెంత కాలం కొనసాగిస్తుంది అనే విషయంపై స్పష్టత ఉండదు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే