తాలిబాన్లపై గెరిల్లా పోరాటం? ‘దళం సిద్ధంగా ఉంది.. ఆయుధాలు పంపండి’

By telugu teamFirst Published Aug 19, 2021, 6:34 PM IST
Highlights

తాలిబాన్లతో తలపడటానికి గెరిల్లా సైన్యం సిద్ధమవుతున్నది. తాలిబాన్లపై రాజీలేని పోరు చేసి వారి చేతిలోనే హతమైన అహ్మద్ షా మసూద్ కుమారుడు అహ్మద్ మసూద్ ఆయన బాటలోనే వెళ్లడానికి నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. మాజీ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్‌తో కలిసి తాలిబాన్ వ్యతిరేక శక్తులను కూడగడుతున్నాడు. ముజాహిదీన్‌లతో కలిసి తాలిబాన్లపై పోరాడుతామని, అమెరికా తమకు ఆయుధాలు సరఫరా చేసి సహకరించాలని అహ్మద్ మసూద్ కోరాడు.
 

న్యూడిల్లీ: తాలిబాన్లపై గెరిల్లా పోరటం చేయడానికి మిలీషియా సిద్ధమవుతున్నది. సోవియట్ సేనలు వెనుదిరిగిన తర్వాత తాలిబాన్లపై రాజీలేని పోరాటం చేసిన ఫైటర్లు ఇప్పుడు మళ్లీ కర్తవ్యానికి పూనుకుంటున్నారు. కానీ, తాలిబాన్లపై పోరాడటానికి ఆయుధాలు లేవని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే అమెరికా తమకు ఆయుధాలు సరఫరా చేయాలని అహ్మద్ మసూద్ విజ్ఞప్తి చేశారు.

తాలిబాన్లపై పోరాటం చేసి, వారి చేతుల్లో హతమైన పోరాటయోధుడు అహ్మద్ షా మసూద్ తనయుడు అహ్మద్ మసూద్ ఈ పోరాటానికి ఉపక్రమించినట్టు వెల్లడించాడు. తన తండ్రి అడుగుజాడల్లోనే నడవాలనుకుంటున్నట్టు వాషింగ్టన్ పోస్టుకు రాసిన ఆర్టికల్‌లో పేర్కొన్నారు. అమెరికా ఇప్పటికీ ఒక ప్రజాస్వామ్య దేశానికి చోదకశక్తిగా కొనసాగవచ్చునని తెలిపారు. తాలిబాన్లపై పోరాడేవారికి సహకరించి అమెరికా ఈ బాధ్యతను కొనసాగించవచ్చునని వివరించారు. ఆయుధాలు, యుద్ధ సామాగ్రి తమకు సరఫరా చేసి తాలిబాన్ల వ్యతిరేక పోరాటాన్ని బలపర్చాలని కోరారు. అఫ్ఘాన్ ప్రజలను తాలిబాన్ల అరాచకాలకు వదిలివేయకుండా తమకు సహకరించి 20ఏళ్ల అఫ్ఘాన్-అమెరికా అనుబంధాన్ని కొనసాగించాల్సిందిగా అభ్యర్థించారు.

గతంలో తాలిబాన్లపై పోరాడిన యోధులు ఇప్పుడు మళ్లీ యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నారని, తానూ ముజాహిదీన్‌లతో కలిసి చేయడానికి నిర్ణయించుకున్నట్టు మసూద్ వెల్లడించారు. తాలిబాన్లకు లొంగిన సీనియర్ మిలిటరీ కమాండర్లపై చాలా మంది జవాన్లలో అసంతృప్తి ఉన్నదని, వారంతా తమ వెంటే ఉన్నారని పేర్కొన్నారు. తాలిబాన్ సమస్య కేవలం ఆఫ్ఘనిస్తాన్‌కే పరిమితం కాబోదని, అది సరిహద్దులు దాటి ఇతర దేశాలకూ పెనుముప్పుగా తయారయ్యే అవకాశముందని వివరించారు. ఇస్లామిస్ట్ ర్యాడికల్స్‌కు ఈ దేశం ఒక హబ్‌గా మారే ప్రమాదముందని, తద్వారా ఇతర ప్రజాస్వామ్య దేశాలపై వారి టార్గెట్ ఉండే ముప్పు ఉన్నదని తెలిపారు. కాబట్టి, తమకు సహకరించాలని అమెరికాను కోరారు. ఇప్పుడు తమ ఆశలన్నీ అమెరికాపైనే ఉన్నాయని వివరించారు.

గతంలో కంటే ఇప్పుడు తాలిబాన్లు చాలా పటిష్టంగా ఉన్నది. అఫ్ఘాన్ సైన్యం ఆయుధాలతోపాటు, అమెరికా  జవాన్ల ఆయుధాలు, జీపులు తాలిబాన్ల అమ్ములపొదిలోకి చేరాయి. ఇటీవలే అమెరికాకు చెందిన ఎం4, ఎం18 రైఫిళ్లతోపాటు ఎం24 స్నైపర్ వెపన్లు, యూఎస్  హంవీలు తాలిబాన్ల చేతుల్లో కనిపించాయి. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమెరికా హడావుడిగా చేపట్టిన ఉపసంహరణతో ఆ ఆయుధాలన్నీ తాలిబాన్ల వశమయ్యాయి. ఆయుధాల పరంగా బలంగా ఉన్న తాలిబాన్లను ఢీకొట్టడం అంత సులభం కాదు. కాబట్టి, అమెరికా తమకు సహకరించాలని మసూద్ కోరారు. వీరంతా పంజ్‌షిర్ ప్రావిన్స్ వేదికగా యుద్ధానికి సమాయత్తమవుతున్నట్టు తెలుస్తున్నది. దేశంలోని 34 ప్రావిన్స్‌లలో తాలిబాన్లు వశపరుచుకోలేని ఏకైక ప్రావిన్స్ పంజ్‌షిర్ అని తెలిసిందే.

click me!