Afghanistan: గూఢచారి నుంచి రాజకీయ నేతగా.. అమృల్లా సలేహ్ ప్రస్థానం

By telugu teamFirst Published Aug 19, 2021, 4:23 PM IST
Highlights

ఆఫ్ఘని‌స్తాన్‌ను గుప్పిట్లోకి తెచ్చుకున్న తాలిబాన్లపై తిరుగుబావుటా ఎగరేయడానికి సిద్ధమవుతున్న అమృల్లా సలేహ్ దేశ తొలి ఉపాధ్యక్షుడు. తాలిబాన్లపై పోరులో అమెరికా నిఘా విభాగం సీఏఐకు సహాయపడ్డ సలేహ్ గూఢచారిగా తన ప్రస్థానం ప్రారంభించి నెంబర్ 2 పొజిషన్ చేరుకున్నారు. తాలిబాన్లకు మోకరిల్లే ప్రసక్తి లేదని తేల్చి చెప్పిన సలేహ్ వ్యక్తిగతంగా ఆ తీవ్రవాదలుతో నష్టపోయారు.

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్ దేశాన్నంతటినీ ఆక్రమించుకున్న తాలిబాన్లు పంజ్‌షిర్ ప్రావిన్స్‌ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. తిరుగుబాటు యోధులకు పేరుగాంచిన పంజ్‌షిర్ విదేశీ సేనలు సహా తాలిబాన్లకు తలొగ్గలేదు. ఇప్పటికీ స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నది. తాలిబాన్ల నుంచి విముక్తిని ఆశించేవారికి పంజ్‌షిర్ భరోసానిస్తున్నది. ఆ పంజ్‌షిర్‌లో జన్మించి తాలిబాన్లకు మోకరిల్లే ప్రసక్తే లేదని ప్రకటించిన దేశా తొలి ఉపాధ్యక్షుడే అమృల్లా సలేహ్. ఆఫ్ఘనిస్తాన్ ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ప్రకటించి తాలిబాన్లపై తిరుగుబాటుకు పిలుపునిచ్చారు. చిన్న వయసులోనే తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభించిన సలేహ్ ప్రస్థానం ఇలా ఉంది.

1972లో పంజ్‌షిర్‌లో జన్మించిన అమృల్లా సలేహ్ చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాడు. పంజ్‌షిర్‌లో తాలిబాన్లను ప్రతిఘటిస్తూ అహ్మద్ షా మసూద్ సారథ్యంలో సాగుతున్న ఉద్యమ ప్రభావం ప్రబలంగా ఉన్న కాలమది. సలేహ్ చిన్నప్పుడే ఆ ఉద్యమంలో పాల్గొన్నాడు. తాలిబాన్లను ఆయన తీవ్రంగా వ్యతిరేకించడానికి ఓ బలమైన కారణమూ ఉన్నది. 1996లో ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్లు తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నప్పుడు ఆయన సోదరిని చిత్రహింసలు పెట్టి హతమార్చారు. అప్పటి నుంచి తాలిబాన్లపై బద్ద శతృత్వం పెంచుకున్నాడు. నార్తర్న్ అలయెన్స్‌తోనూ కలిసి తాలిబాన్లపై పోరాడాడు. 9/11 ఘటన తర్వాత అమెరికా సైన్యం అఫ్ఘాన్‌లో ప్రవేశించేవరకూ వారితోనే ఉన్నాడు.

సీఐఏకు కీలక వ్యక్తిగా..
సోవియెట్ సేనలను బయటికి పంపడం మొదలు, తాలిబాన్లను అధికారం నుంచి తొలగించే వరకూ అమెరికా నిఘా సంస్థ సీఏఐ అఫ్ఘాన్‌లో పరోక్షంగా పనులు చేస్తూనే ఉన్నది. ఈ సమయంలోనే సీఏఐకు అమృల్లా సలేహ్ కీలకమైన సంపదగా పరిణమించాడు. తాలిబాన్ ప్రభుత్వాన్ని కూల్చేయడంలో ప్రముఖంగా సహాయపడ్డాడు. ఈ సహకారమే అనంతర ప్రభుత్వంలో ఆయనకు కీలక బాధ్యతలు దక్కేలా చేశాయి. 2004లో కొత్తగా ఏర్పాటు చేసిన ఆఫ్ఘనిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ హెడ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. పటిష్టమైన నిఘా వలయాన్ని సృష్టించాడు. తాలిబాన్ల ప్రతికదలికను పసిగట్టగలిగాడు. కానీ, పాకిస్తాన్ లాంటి పొరుగుదేశాల సహకారంలో తాలిబాన్లు బలోపేతమయ్యారు. తాలిబాన్లకు సహకరించిన పాక్‌పై ఆయనలో క్రమంగా ఆగ్రహం బలపడింది.

కర్జాయ్‌తో చెడి.. రాజకీయంలోకి
ఆఫ్ఘనిస్తాన్‌ అధ్యక్షుడిగా హమీద్ కర్జాయ్ ఉన్నప్పుడు సలేహ్ రాజకీయంలోకి ప్రవేశించాడు. నేషనల్ పీస్ జిర్గాపై ఉగ్రదాడిని అరికట్టడంలో విఫలమైనందున తాను కర్జాయ్ విశ్వాసాన్ని కోల్పోయానని ప్రకటించి రాజీనామా చేశాడు. అనంతరం తాలిబాన్లు శాంతి చర్చల పేరిట ఉచ్చుతో వస్తున్నారన్న ఆయన సంకేతాలు తప్పుగా తేలడమూ ఇరువురి మధ్య అవిశ్వాసం ఏర్పడినట్టు సమాచారం. రాజీనామా తర్వాత అప్పుడప్పుడు సున్నితంగా కర్జాయ్‌కు వ్యతిరేక కామెంట్లు చేస్తుండేవాడు. బసేజీ మిల్లీ పేరిట ఓ రాజకీయ ఉద్యమానికి తెరలేపి అష్రఫ్ ఘనీతో చేతులు కలిపాడు. 2014లో అష్రఫ్ ఘనీ అధికారంలోకి రాగానే సలేహ్‌ను అంతర్గత వ్యవహారాల మంత్రిగా నియమించుకున్నాడు. 2019లో ఆ పదవికి రాజీనామా చేసి రీఎలక్షన్ ఘనీ వైపున ప్రచారం చేశాడు. ఘనీ మళ్లీ అధికారంలోకి రాగానే సలేహ్‌ను తొలి ఉపాధ్యక్షుడిగా నియమించాడు.

మళ్లీ పోరాటకారుడిగా..
సలేహ్ ఎక్కడి నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడో మళ్లీ అక్కడికే చేరుకున్నాడు. తాలిబాన్లపై ఉద్యమాన్ని ప్రారంభించి క్రమంగా దేశ ఉపాధ్యక్షుడిగా ఎదిగిన అమృల్లా సలేహ్ మళ్లీ వారిపైనే పోరాటానికి సిద్ధమవుతున్నారు. తాలిబాన్లపై అహ్మద్ షా మసూద్‌ చేపట్టిన ఉద్యమంలో పాల్గొని క్రియాశీలంగా వ్యవమరించిన సలేహ్ ఇప్పుడు ఆయన కొడుకు అహ్మద్ మసూద్‌తో కలిసి పోరాటానికి శ్రీకారం చుడుతున్నారు. తాలిబాన్ల వ్యతిరేక శక్తులను సమీకరించే పనిలో ఉన్నారు.

click me!