Afghanistan: జాతీయ జెండా ఎగరేసినవారిపై తాలిబాన్ల కాల్పులు

By telugu teamFirst Published Aug 19, 2021, 3:15 PM IST
Highlights

ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరేస్తున్నవారిపై తాలిబాన్లు కాల్పులు జరిపారు. అసదాబాద్‌లో జరిగిన ఈ ఘటనలో పలువురు మరణించారు. అహంభావి అమెరికా పాలన నుంచి విముక్తి పొందిన రోజుగా ఆగస్టు 19వ తేదీని పేర్కొంటున్నట్టు తాలిబాన్లు ప్రకటించారు.

న్యూఢిల్లీ: ఆగస్టు 19న ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటారు. బ్రిటన్ల నుంచి విముక్తి పొందినందుకు ఈ వేడుకలు చేసుకుంటుంటారు. ఇందులో భాగంగా జాతీయ జెండా ఎగరేస్తారు. స్వాతంత్ర్య దినోత్సవాలకు కొన్ని రోజుల ముందే దేశాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబాన్లు ఈ వేడుకలపై మండిపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండా ఎగరేసినవారిపై తాలిబాన్లు కాల్పులు జరిపారు. అసదాబాద్‌లో నిర్వహించిన ర్యాలీలో స్థానికులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. వీరిపై తాలిబాన్లు కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ఈ ఘటనలో చాలా మంది మరణించినట్టు తెలిసింది. అయితే, వారంతా తాలిబాన్ల కాల్పుల వల్లే మరణించారా? లేక కాల్పుల కారణంగా ఏర్పడిన తొక్కిసలాటలో మరణించారా? అనేది నిర్ధారణ కాలేదు.

యూఎస్ పాలన అంతం.. అదే ఫ్రీడమ్
ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలనూ తాలిబాన్లూ సెలబ్రేట్ చేశారు. కానీ, అమెరికా పాలన అంతానికి గుర్తుగా స్వాంతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్టు తాలిబాన్లు వెల్లడించారు. ‘ఈ రోజు దేశం బ్రిటన్ల నుంచి స్వాంతంత్ర్య పొందిన వార్షికోత్సవాలను నిర్వహించుకుంటుంది. అదే సమయంలో అహంకార శక్తి అమెరికా నుంచీ పవిత్రదేశం ఆఫ్ఘనిస్తాన్‌ను జిహాదీ రక్షించుకోగలిగింది’ అని తెలిపారు.

కాబూల్ ఎయిర్‌పోర్టులో కాల్పులు
కాబూల్ విమానాశ్రయంలో తాలిబాన్లు కాల్పులకు తెగబడ్డారు. ఎయిర్‌పోర్టులోకి వెళ్లడానికి దాని ముందు ప్రజలు పోటెత్తడంతో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. అక్కడి నుంచి వెళ్లిపోవాలని తాలిబాన్లు వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిపారు. కాల్పులకు సంబంధించిన వీడియోలు ప్రతి రోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

click me!