US Supreme Court: US సుప్రీం కోర్ట్ సంచ‌ల‌న తీర్పు.. తుపాకులు క‌లిగి ఉండ‌టం అమెరికన్ల హక్కు

By Rajesh KFirst Published Jun 24, 2022, 6:10 AM IST
Highlights

US Supreme Court: అమెరికా అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. బహిరంగంగా తుపాకులు కలిగి ఉండే హక్కు అమెరికన్లకు ఉందని స్పష్టం చేసింది. న్యూయార్క్‌, లాస్‌ఏంజెలిస్‌, బోస్టన్‌ తదితర పెద్ద నగరాలు సహా అన్ని  ప్రాంతాల్లో పౌరులు తమ వెంట తుపాకులు తీసుకుని వెళ్లొచ్చ‌ని తెలిపింది.
 

US Supreme Court: అమెరికాలో గన్ కల్చర్ నానాటికీ పెరిగిపోతున్నది. దీనికి వ్యతిరేకంగా భారీ ఆందోళనలు జరుగుతున్నాయి. తుపాకి సంస్కృతిని నియంత్రించడానికి కఠినమైన నిబంధనలు అమలు చేయాలని అమెరికన్లు డిమాండ్ చేస్తున్నారు. మార్చ్ ఫర్ అవర్ లైవ్స్ పేరుతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ త‌రుణంలో ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం( US Supreme Court) కీలక తీర్పు వెలువరించింది.

అమెరిక‌న్ల‌కు బహిరంగంగా తుపాకీలను కలిగి ఉండే  ప్రాథమిక హక్కు ఉందని US Supreme Court గురువారం సంచ‌ల‌న‌ తీర్పు నిచ్చింది. తుపాకులు తీసుకెళ్లే వ్యక్తులపై నిషేధం విధించకుండా.. గ‌న్ క‌ల్చ‌ర్ ను పెంచే  చారిత్రాత్మకమైన ఆదేశమిది. 6-3 మెజారిటీతో న్యాయమూర్తులు ఈ తీర్పును వెలువరించారు. ఈ నిర్ణ‌యంలో ఇక నుంచి న్యూయార్క్‌, లాస్‌ఏంజెలిస్‌, బోస్టన్‌ తదితర పెద్ద నగరాలు సహా అన్ని  ప్రాంతాల్లో పౌరులు తమ వెంట తుపాకులు తీసుకుని వెళ్లొచ్చు. వ్యక్తిగత రక్షణకు బహిరంగంగా తుపాకీ కలిగి ఉండటం ఓ వ్యక్తి హక్కు అని జస్టిస్‌ క్లారెన్స్‌ థామస్‌ తీర్పు వెలువ‌రిచారు.
 
ఈ సందర్భంగా గ‌న్ క‌ల్చ‌ర్ కు వ్య‌తిరేకంగా న్యూయార్క్‌ చేసిన చట్టాన్ని కొట్టివేసింది. టెక్సస్‌, న్యూ యార్క్‌, కాలిఫోర్నియాల్లో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో బైడెన్‌ సర్కారు తుపాకుల సంస్కృతికి అడ్డుకట్ట వేస్తూ చట్టం రూపొందించే ప్రయత్నాల్లో ఉంది. కానీ, ఈ దశలో సుప్రీం ఈ తీర్పు వెలువడటం గమనార్హం.  

గ‌త నెల 24 న, టెక్సాస్‌లోని ఉవాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్‌లో 18 ఏళ్ల సాల్వడార్ రామోస్ పందొమ్మిది మంది విద్యార్థులను, ఇద్దరు ఉపాధ్యాయులను కాల్చి చంపాడు, మరో పదిహేడు మంది గాయపడ్డాడు. దీని తర్వాత దాడి చేసిన వ్యక్తి కూడా పోలీసుల చర్యలో మరణించాడు. ఈ  కాల్పుల ఘ‌ట‌న‌ తర్వాత తుపాకీ నియంత్రణ డిమాండ్లు తీవ్రమయ్యాయి. అమెరికాలో గ‌న్ క‌ల్చ‌ర్ ను నియంత్రణ‌కు చ‌ట్టాల‌ను రూపొందించాల‌ని డిమాండ్లు వ‌చ్చాయి. భారీ ఎత్తున నిర‌స‌న‌లు వెల్లువెత్త‌డంతో అమెరికాలోని పలు ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు తగ్గుముఖం పట్టాయి.
  
డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ జో బిడెన్ ఈ నిర్ణయాన్ని ఖండించారు. న్యూయార్క్ స్టేట్ రైఫిల్ అండ్ పిస్టల్ అసోసియేషన్ నిర్ణయం ఇంగితజ్ఞానం, రాజ్యాంగం రెండింటికీ విరుద్ధంగా ఉందనీ, ఈ తీర్పు మనందరినీ తీవ్ర ఇబ్బందికి గురి చేస్తుందని అన్నారు. దేశ వ్యాప్తంగా తుపాకీ భద్రతపై అమెరికన్లు తమ గళాన్ని వినిపించాలని పిలుపునిచ్చారు. ఈ తీర్పులో న్యూయార్క్, లాస్ ఏంజిల్స్ మరియు బోస్టన్‌తో సహా ప్రధాన US నగరాలు, ఇతర ప్రాంతాల వీధుల్లో చట్టబద్ధంగా ఆయుధాలను తీసుకువెళ్లడానికి అనుమతి ఇచ్చింది. 

USలో 390 మిలియన్లకు పైగా తుపాకులు పౌరుల వద్ద ఉన్నాయి. 2020లోనే, 45,000 మందికి పైగా అమెరికన్లు హత్యలు, ఆత్మహత్యలతో సహా షూటింగ్ సంబంధిత సంఘటనలలో మరణించారు. భారీ సామూహిక కాల్పుల తర్వాత తుపాకీ నియంత్రణకు మద్దతు ఉన్న సమయంలో సుప్రీం కోర్టు నిర్ణ‌యం వెలువ‌ర్చ‌డం గ‌మ‌నార్హం.  

click me!