Sri Lanka Crisis: డీజిల్ కోసం ఐదు రోజులు ఎదురుచూసి బంక్ ఎదుట క్యూలోనే మరణించిన ట్రక్ డ్రైవర్

By Mahesh KFirst Published Jun 23, 2022, 8:23 PM IST
Highlights

శ్రీలంక ఆర్థిక సంక్షోభం సామాన్య ప్రజలు ఉసురు తీస్తున్నది. డీజిల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంక్ ముందు ఐదు రోజులుగా ఎదురుచూసిన డ్రైవర్.. క్యూలైన్‌లో ట్రక్‌లోనే మరణించాడు. ఇలాంటి మరణాలు శ్రీలంకలో పది చోటుచేసుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడిస్తున్నది.
 

న్యూఢిల్లీ: శ్రీలంకలో పరిస్థితులు ఇంకా గాడిన పడలేవు. ఆర్థిక పరిస్థితులు ఎప్పుడు మెరుగుపడుతాయో కూడా అంచనా లేదు. నిత్యావసర సరుకులు దొరకట్లేవు. అత్యవసరమైన పెట్రోల్, డీజిల్ కూడా అందుబాటులో ఉండట్లేదు. పెట్రోల్ బంక్‌ల ముందు రోజుల తరబడి వాహనాలు నిలిపి క్యూలు కట్టి పడిగాపులు గాస్తున్నారు. ఇలాంటి ఓ క్యూలోనే ఐదు రోజులుగా డీజిల్ కోసం ఎదురు చూసి చూసి.. ట్రక్‌లోనే ప్రాణం వదిలాడు ఓ డ్రైవర్. ఇలా ఇంధనం కోసం ఎదురుచూసి క్యూలోనే మరణించిన వారిలో ఈయన పదో వ్యక్తి.

అంగురువాటోటలోని ఓ ఫిల్లింగ్ స్టేషన్‌లో చమురు కోసం వాహనాలు పెద్ద లైన్‌లో క్యూలో నిలబడ్డాయి. తన వంతకు కోసం ఐదు రోజులుగా ఓ ట్రక్ డ్రైవర్ ఎదురుచూస్తున్నాడు. కానీ, ఐదు రోజుల తర్వాత ఆ డ్రైవర్ క్యూలోనే మరణించిన హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.

శ్రీలంకలో ఇప్పటి వరకు ఈయన కంటే ముందు తొమ్మిది మంది మరణించారని స్థానిక మీడియా వెల్లడించింది. వారంతా 43 ఏళ్ల నుంచి 84 ఏళ్ల వయసు వారు. అందులోనూ ఎక్కువ మంది హార్ట్ ఎటాక్‌తో మరణించినట్టు డైలీ మిర్రర్ న్యూస్ పేపర్ రిపోర్ట్ చేసింది. 

కొలంబోలోని పానదురాలో ఓ పెట్రోల్ బంక్ ముందు గంంటల తరబడి ఎదురు చూసిన ఓ 53 ఏళ్ల వ్యక్తి కన్నుమూసిన ఘటన ఇటీవలే జరిగింది. ఇంధనం కోసం తన ఆటోలో ఎదురుచూస్తూ గుండె పోటుతో మరనించినట్టు ఆ పత్రిక తెలిపింది. ఈ ఘటన ఓ వారం క్రితం చోటుచేసుకుంది.

2.2 కోట్ల జనాభా గల శ్రీలంక స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి ఇంతటి దారుణ ఆర్థిక సంక్షోభాన్ని ఎన్నడూ చూడలేదు. దేశ ఆర్థిక సంక్షోభంలో ప్రజలు అల్లాడిపోతున్నారు. తీవ్రమైన చమురు కొరత ఉన్నది. ఆహార సరుకుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. మెడిసిన్స్ కూడా దాదాపు కావొచ్చాయి. చమురును దిగుమతి చేసుకోవడానికి శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ సీలోన్ క్రెడిట్ లెటర్‌లను ఓపెన్ చేయలేకపోతున్నది. ఇతర దేశాల నుంచి ఉద్దెరగా చమురును దిగుమతి చేసుకోలేకపోతున్నది. చమురు కొరత మిగతా రంగాలపై తీవ్ర ప్రభావం వేసింది. ఇకపై శుక్రవారాల్లోనూ ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

click me!