
న్యూఢిల్లీ: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎర్ర సముద్రం గుండా పంపే అమెరికా నావలపై ఇరాన్ కన్నెర్ర జేస్తున్నదని అగ్రరాజ్య ఆరోపణ. గత రెండేళ్లలో కనీసం 20 అంతర్జాతీయ స్థాయి నావలను సీజ్ చేయడం లేదా.. అదుపులోకి తీసుకోవాలని ఇరాన్ ప్రయత్నం చేసిందని పేర్కొంది. తాజాగా, పలు సివిలియన్ షిప్‌లను ఇరాన్ సీజ్ చేసిందనే ఆరోపణల నేపథ్యంలో అగ్రరాజ్యం తీవ్రంగా స్పందించింది. 3,000లకు పైగా మిలిటరీ సిబ్బందిని రెండు యుద్ధ నౌకల ద్వారా ఎర్ర సముద్రానికి పంపింది. ఈ విషయాన్ని అమెరికా నేవీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
సూయజ్ కెనాల్ ద్వారా ముందస్తు ప్రకటనలు చేసే ఎర్రసముద్రంలోకి తమ రెండు నౌకలు ప్రవేశించినట్టు సోమవారం ఓ ప్రకటన అమెరికా వెలువరించింది. ఈ చర్యతో ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అంతర్జాతీయ చమురు వాణిజ్యానికి ఈ గల్ఫ్ దేశాల గుండా వెళ్లే జలమార్గాలు కీలకంగా ఉన్నాయి. ఈ జలాల్లో అమెరికా, ఇరాన్‌కు మధ్య ఉద్రిక్తతలు ఏర్పడటం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయి.
తమ వాణిజ్య నౌకలపై ఇరాన్ కక్షపూరితంగా వ్యవహరించడాన్ని, వేధింపులకు పాల్పడటాన్ని నిలువరించడానికే ఈ రెండు నౌకలను పంపించినట్టు అమెరికా తెలిపింది. ఈ రెండు నౌకలు యుద్ధానికి సంబంధించి ఫీచర్లు కలిగిన నౌకలు. తమ నౌకలకు భద్రత కోసం వీటిని పంపినట్టు అమెరికా చెబుతున్నది. కానీ, ఇరాన్ మాత్రం ఆ వ్యాఖ్యలను విశ్వసించడం లేదు.
గల్ఫ్ దేశాల ప్రయోజనాలను అమెరికా ఎప్పుడూ ఆలోచించలేదని, కేవలం దాని ప్రయోజనాలే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుందని ఇరాన్ ప్రత్యారోపణలు చేసింది. తాజాగా, ఈ రెండు నౌకల మోహరింపు కూడా అమెరికా ప్రయోజనాల కోసమే అని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి నాసర్ కనని తెలిపారు. ఇక్కడ అస్థిరత, అభద్రతను రేపడమే అమెరికా లక్ష్యం అని ఘాటుగా స్పందించారు. పర్షియన్ గల్ఫ్ దేశాలు తమను తాము కాపాడుకోగల సమర్థ దేశాలే అని ఆయన తెలిపారు.
ఒమన్‌కు సమీపంలో అంతర్జాతీయ జలాల్లో వెళ్లుతున్న తమ కమర్షియల్ ట్యాంకర్లను జులై 5వ తేదీన ఇరాన్ సీజ్ చేయ ప్రయత్నిస్తే తమ బలగాలు అడ్డుకోగలిగాయని వాషింగ్టన్ ఆరోపించిన తర్వాత ఈ పరిణామాలు జరిగాయి.