
న్యూఢిల్లీ: ఇప్పుడు అందరూ ఉక్రెయిన్(Ukraine)లో చోటుచేసుకుంటున్న పరిణామాల గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్‌పై రష్యా(Russia) దాడి గురించి ఆందోళనలు వెలువడుతున్నాయి. రష్యా దాడులను ఖండిస్తున్నారు. ఉక్రెయిన్‌కు సానుభూతి ప్రకటిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా సహా అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాలూ ఉక్రెయిన్ వైపు నిలబడ్డాయి. యావత్ ప్రపంచమే ప్రతి రోజు ప్రతి అప్‌డేట్‌ను తెలుసుకుంటున్నది. అయితే, ఇప్పుడు యుద్ధం కేవలం ఉక్రెయిన్‌లోనే జరగడం లేదు. నిజం చెప్పాలంటే.. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను రష్యా ప్రకటించడానికి పూర్వమే యెమెన్(Yemen) రావణకాష్టంలా మండుతున్నది. ఎనిమిదేళ్లుగా ఇక్కడ ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా(America), ఇరాన్(Iran)ల ప్రచ్ఛన్న యుద్ధానికి యెమెన్ వేదికగా మారింది.
ప్రపంచంలోనే అత్యంత మానవ విషాదంగా యెమెన్ సంక్షోభాన్ని ఐక్యరాజ్య సమితి పేర్కొన్నది. యెమెన్ మెడపై కత్తి వేలాడుతున్నదని తెలిపింది. ప్రతి రోజు ఇది మరింత లోతుగా సంక్షోభంలో మునిగిపోతున్నది. అమెరికా, ఇరాన్‌ల మధ్య విభేదాలకు యెమెన్ బలి అవుతున్నది. ఇక్కడ వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. లక్షకు సమీపంగానే చేరి ఉండొచ్చు మరణాల సంఖ్య. కనీసం 40 లక్షల మంది ఆడ, మగ, పిల్లలు ఆవాసాలు కోల్పోయి దేశంలోనే శరణార్థులుగా మారిపోయారు. గత మూడేళ్లలో 2022లోనే అత్యధిక మరణాలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 650 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఈ రెండు నెలల్లోనే 23 వేల మంది పౌరులు నిరాశ్రయులయ్యారు. ఎనిమిదేళ్లుగా ఈ ఘర్షణలు సాగుతూనే ఉన్నాయి.
ఘర్షణలు ఎలా మొదలయ్యాయంటే.. కొంత లోతుకు వెళ్లాలి. యెమెన్ ఈ రూపంలో ఒక కొత్త దేశమేనని చెప్పాలి. కొన్నేళ్ల దాడుల తర్వాత ఉత్తర, దక్షిణ యెమెన్‌లు కలిసిపోయయి. 1990 ఇవి రెండు కలిసి యెమెన్ అనే దేశానికి రూపాన్ని ఇచ్చాయి. తద్వార ఈ ఘర్షణలకు ఫుల్ స్టాప్ పడుతుందని భావించారు. కానీ, శాంతి స్థాపన జరగలేదు. ఇప్పటికీ ఆ దేశంలో సివిల్ వార్ జరుగుతూనే ఉన్నది. ఈ దేశ ప్రభుత్వాన్ని ఐక్యరాజ్య సమితి, అన్ని పెద్ద దేశాలూ గుర్తించాయి. కానీ, ఈ అంతర్యుద్ధాల మధ్య ప్రభుత్వమే అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఉత్తర యెమెన్, దక్షిణ యెమెన్‌లు కలిసినంత సులువుగా ఆ దేశాల్లో అంతకు ముందు పోరాడిన గ్రూపులు ఏకం కాలేవు. ముఖ్యంగా హౌతీ తిరుగుబాటుదారులు ఐక్యంగా ఏర్పడ్డ దేశ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ వచ్చారు. 2011లో అంటే అరబ్ స్ప్రింగ్ సమయంలో యెమెన్ అధ్యక్షుడు అనేక కారణాల రీత్యా రాజీనామా చేసి పారిపోవాల్సి వచ్చింది. ఆయన డిప్యూటీ మన్సూర్ హదీ అధికార పగ్గాలు చేపట్టాడు.
కానీ, ఆయన బలహీనుడని తెలియగానే హౌతీ తిరుగుబాటుదారులు దూకుడు పెంచారు. యెమెన్ రాజధాని సనా కోసం దాడులు ముమ్మరం చేశారు. 2014లో ఇక్కడ సాయుధ పోరాటం బద్ధలైంది. క్రమంగా ఇది సున్నీ మెజారిటీ సౌదీ అరేబియా, షియా డామినేట్ గా ఉన్న ఇరాన్‌కు మధ్య యుద్ధంగా మారింది. ఇక్కడ ప్రభుత్వాన్ని సౌదీ అరేబియా సమర్థిస్తుంటే.. హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ మద్దతు ఇస్తున్నదని వాదనలు ఉన్నాయి. ఇప్పుడు యెమెన్‌లోని 80 శాతం భూభాగాన్ని హౌతీ తిరుగుబాటుదారులు ఆక్రమించుకుని తమ అధీనంలో ఉంచుకున్నారు. కాగా, రాజధాని సనాను మాత్రం తిరుగుబాటుదారులకు దక్కకుండా సౌదీ అరేబియా చాకచక్యంగా వ్యవహరించింది.