
న్యూఢిల్లీ: ఉక్రెయిన్(Ukraine)పై రష్యా(Russia) దాడులు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్(Kyiv), ఖార్కివ్(Kharkiv) నగరాలపై రష్యా బాంబులు వేసింది. ఈ రెండు నగరాల్లో బాంబులు, షెల్లింగ్ చప్పుళ్లతో దద్దరిల్లిపోతున్నాయి. అయితే, ఈ భయానక పరిస్థితులు ఒకప్పటి దుర్మార్గాన్ని గుర్తుకు తెస్తున్నాయి. ఉక్రెయిన్‌లోని ఈ రెండు కీలక నగరాలపై చివరిసారిగా బాంబులు పడింది.. అడాల్ఫ్ హిట్లర్(Adolf Hitler) ఆక్రమణ సమయంలోనే. దీంతో ఇప్పటి రష్యా యుద్ధంతో రెండో ప్రపంచ యుద్ధ కాలాన్ని ప్రముఖులు గుర్తు చేస్తున్నారు. ఇందులో మరో విశేషమూ ఉన్నది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రష్యా సైన్యం ఖార్కివ్ నగరం కోసం అడాల్ఫ్ హిట్లర్ సైన్యంతో పోరాడింది. ఇప్పుడు రష్యా సైన్యమే ఖార్కివ్ నగరంపై బాంబులు వేస్తున్నది.
రష్యా ఈ నెల 24న ఉక్రెయిన్‌పై మిలిటరీ ఆపరేషన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఖార్కివ్ నగరంలోని ఓ ప్రభుత్వ కార్యాలయాన్ని రష్యా ధ్వంసం చేసింది. సోమవారం ఒక్క రోజే ఈ నగరంలో 17 మందిని రష్యా సైన్యం పొట్టనబెట్టుకున్నట్టు తెలిసింది. కాగా, కీవ్‌లోనూ పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. అనేక నివాసాలు, బిల్డింగ్‌లు కాలిపోతున్నట్టు శాటిలైట్ దృశ్యాల్లో తేలింది. కాగా, కీవ్ నగరం బయట సుమారు 40 మైళ్ల మేరకు రష్యా సైన్యం కాన్వాయ్ ఉన్నట్టూ కనిపించింది.
కాగా, చివరిసారి కీవ్, ఖార్కివ్ నగరాలపై బాంబులు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పడ్డాయి. అడాల్ఫ్ హిట్లర్ యూరప్‌ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుండగా ఈ రెండు నగరాలపై బాంబులతో ప్రధాన దాడి జరిగింది. 1941 సెప్టెంబర్‌లో కీవ్ నగరంలోకి జర్మనీ బలగాలు ప్రవేశించిన రెండు రోజుల్లోనే కనీసం 30 వేల మంది పౌరులను పొట్టనబెట్టుకున్నది. ఆ తర్వాతి నెలల్లో కీవ్‌లోనే ఉండిపోయిన జర్మనీ బలగాలు వేలాది మంది పౌరులను హతమార్చింది. కాగా, 1941 అక్టోబర్‌లో ఖార్కివ్ నగరం కోసం జర్మనీ, సోవియట్ యూనియన్‌ల మధ్య భీకర యుద్ధం జరిగింది. ఈ నగర సరిహద్దులకు చేరిన నాలుగు రోజుల్లోనే జర్మనీ ఆర్మీ ఖార్కివ్ నగరాన్ని దురాక్రమించుకుంది.
ఉక్రెయిన్ నేతలు ప్రస్తుత రష్యా దాడులను రెండో ప్రపంచ యుద్ధ ఘటనలతో పోలికలు తీస్తున్నారు. శుక్రవారం ఉదయం ఉక్రెయిన్ అధ్యక్షుడ జెలెన్‌స్కీ మాట్లాడుతూ రెండో ప్రపంచ యుద్ధాన్ని ప్రస్తావించారు. కీవ్ నగరంలో బాంబులు వేయడం ప్రారంభించారని పేర్కొన్నారు. ఇది 1941లో జరిగిన దాడుల్లాగే ఉన్నదని వివరించారు. రష్యా పౌరులు ఈ దాడులపై నిరసనలు చేస్తున్నట్టు తెలిసిందని పేర్కొన్నారు. రష్యా పౌరులు తమ బాధలు విన్నారని, తమను నమ్మడం ప్రారంభించారని వివరించారు. తమ కోసం పోరాడండని తెలిపారు.
ఖార్కివ్ నగరం (kharkiv) బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. రష్యా సేనలు (russian army) మిస్సెల్స్‌తో విరుచుకుపడుతున్నాయి. జనావాసాలను సైతం టార్గెట్ చేస్తున్నారు రష్యా సైనికులు. ఉదయం నుంచి క్షిపణుల దాడులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు 20 మందికి పైగా చనిపోయినట్లు మేయర్ ప్రకటించారు. ఖర్కీవ్ దగ్గర రష్యా దాడులు.. విద్యార్ధుల తరలింపునకు అడ్డంకిగా మారింది. ఈ క్రమంలో విద్యార్ధుల తరలింపునకు సురక్షిత మార్గం కల్పించాలని రష్యా, ఉక్రెయిన్‌లను కోరింది కేంద్ర విదేశాంగ శాఖ .