
Afghanistan Bus Fire Tragedy: అఫ్గానిస్థాన్‌లో దారుణ రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇరాన్ నుంచి స్వదేశానికి తిరిగి వెళ్తున్న బస్సులో ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో బస్సు ఆకస్మికంగా మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో 17 మంది చిన్నారులతో సహా మొత్తం 71 మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ హెరాత్ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
సమాచారం ప్రకారం.. ఇటీవల ఇరాన్ నుంచి బహిష్కరణకు గురైన అఫ్గాన్ వలసదారులు బస్సులో స్వగ్రామాలకు వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన మోటార్ సైకిల్‌ను బస్సు ఢీకొట్టింది. ఈ క్రమంలో బస్సులో మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు బస్సు మొత్తం వ్యాప్తించగా.. ప్రయాణికులు బయటపడే అవకాశం లేకుండా పోయింది.
తక్షణమే అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ప్రాణనష్టం భారీగా జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో మోటార్ బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా మృతి చెందారు.
ప్రాథమిక దర్యాప్తులో నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని తేలింది. అయితే దీనిపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు. ఇక మరోవైపు, ఇటీవల ఇరాన్, పాకిస్థాన్ దేశాలు అఫ్గాన్ శరణార్థులపై కఠిన చర్యలు చేపడుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి దాదాపు 1.5 మిలియన్ల మందికి పైగా అఫ్గాన్ శరణార్థులు ఈ రెండు దేశాల నుంచి బలవంతంగా స్వదేశానికి పంపించబడ్డారు.