‘సింగపూర్..చైనాలో ఉందా..? కిమ్ హైట్ ఎంత?’

First Published 12, Jun 2018, 1:42 PM IST
Highlights

నెట్టింట అమెరికన్ల ప్రశ్నల వర్షం

‘ సింగపూర్ ఎక్కడ ఉంది?’ ‘ సింగపూర్ ఒక దేశమా?’ ‘కిమ్ హైట్ ఎంత?’ ఏంటీ ప్రశ్నలు అనుకుంటున్నారా..? ఈ ప్రశ్నలు మేము అడగడం లేదండి.. అమెరికన్లు అడుగుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే..  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్  సమావేశమైన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సమావేశం సింగపూర్ వేదికగా జరిగింది. కాగా.. ఈ భేటి గురించి  అమెరికన్ నెటిజన్లు గూగుల్ కి పనిపెట్టారు.  గూగుల్  లో సదస్సుకి సంబంధించి పలు ప్రశ్నలు సంధించారు. వాటిలో ఎక్కువ మంది అడిగిన ప్రశ్న.. సింగపూర్ ఎక్కడ ఉంది..?

‘ప్రపంచంలో సింగపూర్ ఎక్కడ ఉంది?’ అన్న పదం కూడా అధిక సంఖ్యలో సెర్చ్ చేసిన పదాల జాబితాలో ఉంది. కాగా ఈ దేశాధినేతల సమ్మిట్‌పై తొలిసారి ప్రకటన వెలువడిన జూన్ 10న కూడా ఇంతే స్థాయిలో అమెరికన్లు గూగుల్‌కి పోటెత్తారు. ‘నార్త్ కొరియా ఎక్కడ’, ‘సింగపూర్ ఒక దేశామేనా’, ‘సింగపూర్ చైనాలో ఉందా? జపాన్‌లో ఉందా?’ అంటూ రకరకాల ప్రశ్నలకు సమాధానాలు వెదికారు.

 సింగపూర్ ఎక్కడుందో తెలుసుకోవడం ఒక్కటే కాదు.. అమెరికన్లు కిమ్ గురించి కూడా ఆసక్తిగా గూగుల్‌లో వెదికారు. ‘కిమ్ జాంగ్ ఉన్ ఎంత ఎత్తు ఉంటాడు’, ‘కిమ్ జాంగ్ ఉన్‌కి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చా?’ అంటూ రకరకాల ప్రశ్నలు సంధించారు. అణ్వాయుధాలకు ముగింపు పలికేందుకు అమెరికా, ఉత్తర కొరియా అధినేతలు ఇవాళ ఉదయం తటస్థ దేశం సింగపూర్‌లో సమావేశం అయ్యారు.

Last Updated 12, Jun 2018, 1:42 PM IST