
రఫేల్ యుద్ధ విమానాల నిర్మాణంలో కీలకమైన భాగాలైన ఫ్యూజ్‌లేజ్‌లు త్వరలోనే భారతదేశంలో తయారవుతాయి. డస్సాల్ట్ ఏవియేషన్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) సంయుక్తంగా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యం భారత్ ఏరోస్పేస్ రంగంలో వృద్ధికి నూతన దారులు వేస్తుంది.
ఈ ఒప్పందానికి అనుగుణంగా, హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా ఒక అత్యాధునిక ఉత్పత్తి కేంద్రాన్ని టాటా గ్రూప్ ఏర్పాటు చేయనుంది. ఇది దేశంలో ఏరోస్పేస్ రంగానికి ఒక కీలక పెట్టుబడిగా నిలవనుంది.
ఈ కేంద్రంలో రఫేల్ యుద్ధ విమానం వెనుక భాగం, మధ్య భాగం, ముందుభాగం వంటి నిర్మాణాలు తయారవుతాయి. మొదటి ఫ్యూజ్‌లేజ్ భాగాలు 2028 ఆర్థిక సంవత్సరం నాటికి తయారవుతాయని అంచనా. ఈ ప్లాంట్ నెలకు రెండు పూర్తి ఫ్యూజ్‌లేజ్‌ల ఉత్పత్తి సామర్థ్యంతో పని చేస్తుంది.
డస్సాల్ట్ ఏవియేషన్ ఛైర్మన్, సీఈఓ ఎరిక్ ట్రాపియర్ ఈ భాగస్వామ్యాన్ని ఎంతో కీలకమైందిగా అభివర్ణించారు. ఫ్రాన్స్ వెలుపల రఫేల్ ఫ్యూజ్‌లేజ్‌ల తయారీ మొదలుపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. భారత ఏరోస్పేస్ రంగంలో టాటా సంస్థల భాగస్వామ్యం, నాణ్యత ప్రమాణాలపై డస్సాల్ట్ నమ్మకాన్ని ఇది సూచిస్తుందని ఆయన తెలిపారు.
టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సీఈఓ సుకరం సింగ్ మాట్లాడుతూ, ఈ భాగస్వామ్యం భారత ఏరోస్పేస్ రంగంలో ఒక కీలక మైలురాయి. భారత్‌లో ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా యుద్ధ విమానాల నిర్మాణం జరుగుతున్నట్టు ఇది స్పష్టం చేస్తుందని అన్నారు. డస్సాల్ట్ సంస్థ భారత్‌పై ఉంచిన విశ్వాసం, భవిష్యత్‌లో మరో దశకు తీసుకెళ్లే అవకాశం ఇది అని అభిప్రాయపడ్డారు.