ఘరానా దొంగను అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు.. స్క్రూ డ్రైవర్, కటింగ్ ప్లేయర్‌లతో చోరీ

By telugu teamFirst Published Aug 11, 2021, 5:54 PM IST
Highlights

హైదరాబాద్‌లో రాత్రి పగలు అనే తేడా లేకుండా కన్నాలేసిన ఘరానా దొంగ మొహమ్మద్ సలీమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గతేడాది మార్చి నుంచి కనీసం 12 ఇళ్లల్లోకి దూరి సుమారు రూ. 18 లక్షల విలువైన నగలను దొంగిలించాడని అధికారులు వెల్లడించారు.  ఇందులో 36.5 తులాల బంగారం, సుమారు కిలో వెండి నగలున్నట్టు తెలిపారు.

హైదరాబాద్: పట్టపగలు, అర్ధరాత్రి అనే తేడా లేకుండా రాజధాని నగరంలోని ఇళ్లకు కన్నాలేసిన ఘరానా దొంగను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. స్క్రూ డ్రైవర్, కటింగ్ ప్లేయర్‌లతో అలవోకగా సొమ్మును మాయం చేసే మొహమ్మద్ సలీమ్ అలియాస్ సునీల్ శెట్టిను హైదరాబాద్ సౌత్ జోన్ టీమ్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది, చంద్రయాణగుట్ట పోలీసులు కలిసి అరెస్టు చేశారు. చోరకళలో ‘అద్భుత’ నైపుణ్యమున్న సలీమ్ రూ. 18 లక్షల విలువైన నగలను దొంగిలించినట్టు పోలీసులు వెల్లడించారు.

హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలోని 12 ఇళ్లల్లో సలీమ్ చోరీకి పాల్పడ్డాడని తెలిపారు. ఇందులో 36.5 తులాల బంగారం, సుమారు కిలో వెండి నగలు ఉన్నట్టు వెల్లడించారు. సలీమ్ ఎక్కువగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల ఇళ్లనే సలీమ్ టార్గెట్ చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. నేరుగా ఇంటి ఆవరణలోకి ప్రవేశించి స్క్రూడ్రైవర్, కటింగ్ ప్లేయర్‌లతో ఇంటి తాళం తొలగించి లోపటికి వెళ్తాడని వివరించారు. చోరకళ నైపుణ్యంతో అల్మారాలనూ ఈ రెండు పరికరాలతో తెరుస్తాడని, అంతే, అందులోని నగలను అందుకుని పరారవుతాడని చెప్పారు.

హైదరాబాద్‌లో ఫతేదర్వాజ ఏరియాలోని కుమ్మార్‌వాడిలో పుట్టి పెరిగిన మొహమ్మద్ సలీమ్ వృత్తిరీత్యా పెయింటర్. ఫలక్‌నూమలోని నవాబ్ సాహెబ్ కుంటలో నివాసముంటున్నాడు. 1991 నుంచి చిన్నా చితక దొంగతలు చేస్తు్న్నాడు. 2018లో కాంచన్ బాగ్ పోలీసు స్టేషన్ ఏరియాలో అరెస్ట్ అయ్యాడు. అనంతరం సలీమ్‌పై పీడీ యాక్ట్ నమోదైంది. మార్చి 2021లో జైలు నుంచి విడుదలైన తర్వాతా ఆయన మళ్లీ దొంగతనాలు ప్రారంభించాడు. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్‌ల పరిధిలో ఇప్పటి వరకు కనీసం 12 ఇళ్లలో దొంగతనాలు చేశాడు. తాజాగా, మళ్లీ అరెస్ట్ అయ్యాడు.

click me!