
పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా.. ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నా సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో జనాన్ని మోసం చేస్తూనే వున్నారు. క్విక్కర్, ఓఎల్ఎక్స్‌లలో నేరాలతో పాటుగా నయా మోసాలకు తెరలేపారు.
రియల్ ఎస్టేట్ వెబ్‌సైట్లతో మోసాలు చేస్తున్నారు కేటుగాళ్లు. ఇళ్లు, ప్లాట్లు రెంట్‌కి తీసుకుంటామంటూ కుచ్చుటోపీ పెడుతున్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బు పంపిస్తామంటూ టోకరా వేస్తున్నారు.
వారం రోజుల్లోనే కోట్ల రూపాయలు కొట్టేశారు సైబర్ చీటర్స్. ఎవరు పడితే వారు పంపిన క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయొద్దని చెబుతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలలో ఇందుకు సంబంధించి భారీగా కేసులు నమోదవుతున్నాయి.
ఫేస్‌బుక్, క్విక్కర్, ఓఎల్ఎక్స్‌లో పెట్టిన వస్తువులను చూసి తాము కొనుగోలు చేస్తామని అవతలి వ్యక్తికి ఫోన్ చేస్తారు. అనంతరం డబ్బును క్యూఆర్ కోడ్ ద్వారా పంపుతామని చెబుతారు. దీనిని నమ్మి నిర్వాహకులు క్యూఆర్ కోడ్‌ను పెడితే.. శాంపిల్‌గా పదిరూపాయలు వేసేవారు.
ఆ తర్వాత నిర్వాహకుల ఖాతా నుంచి డబ్బు డెబిట్ అయ్యేది. ఈ విధంగా పలువురి నుంచి కోట్లాది రూపాయలను కొట్టేశారు కేటుగాళ్లు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.